Andhra Pradesh: 9 నెలల తర్వాత ఏపీలో తెరుచుకున్న థియేటర్లు.. తొలి రోజు హౌస్‌ఫుల్

solo brathuke so better movie released in theaters first time after lockdown
  • థియేటర్ల వద్ద మళ్లీ కనిపించిన ప్రేక్షకుల సందడి
  • సీటుకు సీటుకు మధ్య దూరం పాటించిన యాజమాన్యాలు
  • థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు అందుబాటులో
  • షో ముగిసిన తర్వాత సీట్లకు డిస్ ఇన్పెక్షన్ స్ప్రే
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మూతపడిన సినిమా థియేటర్లు 9 నెలల తర్వాత నిన్న తెరుచుకున్నాయి. సాయిధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నిన్న రాష్ట్రవ్యాప్తంగా పలు థియేటర్లలో విడుదలైంది. కరోనా నేపథ్యంలో సినిమా హాళ్లకు మళ్లీ జనం వస్తారా? అన్న అనుమానాలను ప్రేక్షకులు పటాపంచలు చేశారు. ఈ సినిమాను ప్రదర్శించిన దాదాపు అన్ని థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి.  సినిమా విడుదల నేపథ్యంలో హాళ్ల వద్ద సందడి కనిపించింది.

కొవిడ్ నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. మాస్క్ ధరించిన వారినే లోపలకు అనుమతించాయి. అలాగే థర్మల్ స్క్రీనింగ్ చేసి, శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసిన తర్వాతే ప్రేక్షకులను లోపలికి పంపించాయి. షో ముగిసిన తర్వాత సీట్లకు డిస్ ఇన్‌ఫెక్షన్ స్ప్రే చేస్తున్నారు. సీటుకు సీటుకు మధ్య ఒక సీటు ఖాళీ ఉంచుతున్నారు.

విశాఖపట్టణంలో 20 వరకు హాళ్లు తెరుచుకోగా అన్నీ ఫుల్ అయ్యాయి. అలాగే, కాకినాడలోనూ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. కొన్ని నెలల తర్వాత సినిమా చూస్తుండడంతో చాలా మంది ఆ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. టికెట్లతో సెల్ఫీలు దిగుతూ పోస్టులు పెట్టారు.
Andhra Pradesh
solo brathuke so better
Movie Theaters

More Telugu News