Adinarayana Reddy: తాడిపత్రిలో జేసీ, పెద్దారెడ్డి ఇద్దరిదీ తప్పే: ఆదినారాయణరెడ్డి

  • పెద్దారెడ్డికి పోలీసుల సహకారం ఉంది
  • ఇలాంటి సంస్కృతి పోవాలంటే తిరుపతిలో బీజేపీకి ఓటు వేయాలి
  • వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం
YSRCP govt introduced biscuit kind of schemes says Adinarayana Reddy

తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. జేసీ ఇంటికి పెద్దారెడ్డి వెళ్లడం, ఆయన కూర్చున్న ఛైర్ ను జేసీ వర్గీయులు కాల్చేయడం వంటి ఘటనలు ఆ ప్రాంతంలో పొలిటికల్ హీట్ ను పెంచాయి. పెద్దారెడ్డి వాహనం అద్దాలను జేసీ వర్గీయులు పగులకొట్టారు.

ఈ నేపథ్యంలో, బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ, తాడిపత్రిలో జేసీ, పెద్దారెడ్డి ఇద్దరిదీ తప్పుందని చెప్పారు. కట్టెలు పట్టుకుని పెద్దారెడ్డి రచ్చ చేసేందుకు పోయారని అన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చర్చకు వెళ్లానని చెప్పడం విచిత్రంగా ఉందని అన్నారు. తనపై కేసు పెట్టినా ఉపయోగం ఉండదని అన్నారని... పెద్దారెడ్డికి పోలీసుల సహకారం ఉందని చెప్పారు. ఇలాంటి సంస్కృతి పోవాలంటే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీని గెలిపించాలని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారైందని... అసలైన పథకాలను ఎత్తేసి, బిస్కెట్లలాంటి పథకాలను పెట్టారని చెప్పారు. పార్టీ రంగుల కోసం రూ. 4 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. సారాను స్కాచ్ మాదిరి అమ్ముతున్నారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. రోడ్లు పాడైతే ఒక్క గుంతను కూడా పూడ్చలేదని చెప్పారు. ప్రతి దాంట్లో వ్యాపారాన్నే చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఒక ఫ్లాష్ మాదిరి వచ్చిందని, అదే మాదిరి ఒక ఫ్లాష్ లా పోతుందని చెప్పారు.

కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆదినారాయణరెడ్డి విమర్శించారు. రైతులను పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాయని అన్నారు. చట్టాలలో మార్పులను సూచించడంలో తప్పులేదని... కానీ, చట్టాలనే తీసివేయాలని చెప్పడం సరికాదని చెప్పారు. దివంగత వాజపేయి జయంతి సందర్భంగా రాజంపేటలో ఈరోజు రైతు చర్చా వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ లైవ్ ను రైతులతో కలిసి చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News