శకుంతల పాత్రలో అందాల బుట్టబొమ్మ?

25-12-2020 Fri 14:48
  • టాలీవుడ్, బాలీవుడ్ లలో బిజీగా పూజహెగ్డే 
  • 'శాకుంతలం'ను తెరకెక్కిస్తున్న గుణశేఖర్
  • శకుంతలగా పూజహెగ్డే నటిస్తున్నట్టు ప్రచారం
  • వచ్చే ఏడాది మూడు నెలల్లో చిత్ర నిర్మాణం  
Pooja hegde rumored to play Shakuntala

వరుస విజయాలతో పలు ఆఫర్లు అందుకుంటూ ఇటు  టాలీవుడ్ లో.. అటు బాలీవుడ్ లో దూసుకుపోతున్న అందాల బుట్టబొమ్మ పూజ హెగ్డే త్వరలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించనున్నట్టు, అందులో పౌరాణిక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. కాళిదాసు కవిత్వంలో.. రవివర్మ కుంచెలో కొత్త అందాలు సంతరించుకున్న శకుంతల పాత్రను ఈ చిన్నది పోషించే అవకాశం ఉందని టాలీవుడ్ లో ప్రచారం ఊపందుకుంది.

ఆమధ్య అనుష్కతో 'రుద్రమదేవి' వంటి భారీ చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తన తదుపరి చిత్రంగా 'శాకుంతలం'ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అద్భుత ప్రణయగాథగా దీనిని తెరకెక్కించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో శకుంతల పాత్రకు పూజ హెగ్డేను తీసుకున్నట్టు తాజాగా ఫిలిం నగర్లో ప్రచారం జరుగుతోంది. కొత్త సంవత్సరంలో మూడు నెలల్లోనే చిత్రాన్ని పూర్తిచేయాలని గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా పూజ డేట్స్ అడుగుతున్నారట. మరి, ఈ విషయంలో అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి!