రవితేజ సినిమాలో కన్నడ భామ ప్రణీత?

25-12-2020 Fri 09:46
  • పలు సినిమాలలో గ్లామర్ పాత్రలు పోషించిన ప్రణీత 
  • గత కొన్నాళ్లుగా హిందీలో నటిస్తున్న ముద్దుగుమ్మ
  • రవితేజ 'ఖిలాడి' సినిమా నుంచి తాజా ఆఫర్
  • పక్కా మాస్ సాంగులో నటించనున్న ప్రణీత  
Praneetha to be part of Ravitejas movie
గ్లామర్ తారగా తెలుగు సినిమాలలో తనదైన ముద్ర వేసిన కథానాయికగా ప్రణీతను చెప్పుకోవచ్చు. 'అత్తారింటికి దారేది', 'రభస', 'డైనమైట్', 'బ్రహ్మోత్సవం'.. వంటి పలు సినిమాలలో కథానాయికగా అలరించిన ఈ కన్నడ భామ గత కొన్నాళ్లుగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం రెండు, మూడు హిందీ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ తరుణంలో ఈ ముద్దుగుమ్మకు ఓ తెలుగు సినిమాలో తాజాగా అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.

ప్రముఖ కథానాయకుడు రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' పేరుతో తాజాగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో కొనసాగుతోంది.

ఇక ఈ చిత్రంలో ఓ స్పెషల్ ఐటమ్ సాంగు వుందట. ఈ పాటకోసం ప్రణీతను సంప్రదించగా, ఆమె ఓకే చెప్పినట్టు తాజా సమాచారం. పక్కా మాస్ సాంగుగా దీనిని ట్యూన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ పాటను రవితేజ, ప్రణీతలపై చిత్రీకరిస్తారని అంటున్నారు.