కొత్తరకం కరోనా వైరస్ ప్రమాదకరమే... రోగులు, మరణాల సంఖ్య పెరుగుతుంది: లండన్ నిపుణుల వెల్లడి

24-12-2020 Thu 22:06
  • బ్రిటన్ లో వేగంగా పాకిపోతున్న కరోనా కొత్త స్ట్రెయిన్
  • అధ్యయనం చేపట్టిన లండన్ పరిశోధక సంస్థ
  • 56 శాతం వేగంగా వ్యాపిస్తుందని వెల్లడి
  • పాత రకాలకు దీనికి పెద్దగా తేడా లేదన్న యూరప్ ఆరోగ్య సంస్థ
corona virus new strain would be causes more hospitalizations a study said
బ్రిటన్ లో విజృంభిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, అనేకమందిని ఆసుపత్రుల పాల్జేస్తుందని, దీని ద్వారా మరణాల శాతం కూడా పెరిగే అవకాశం ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. వచ్చే ఏడాది దీని ప్రభావం గణనీయంగా ఉండబోతోందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ కు చెందిన సెంటర్ ఫర్ మేథమేటికల్ మోడలింగ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సంస్థ పరిశోధకులు వెల్లడించారు.

ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న కరోనా స్ట్రెయిన్ లతో పోల్చితే ఈ కొత్త స్ట్రెయిన్ 56 శాతం అధికంగా వ్యాపిస్తుందని తేలింది. ఈ వైరస్ ఎంత తీవ్రతతో వ్యాధి లక్షణాలు కలుగజేస్తుందనడానికి ఇప్పటివరకైతే స్పష్టమైన ఆధారాలు లేవని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు.

బ్రిటన్ ప్రభుత్వం కూడా ఇప్పటికే దీనిపై ఇదే తరహా అంచనాలు వెలువరించింది. ఇతర కరోనా రకాలతో పోల్చితే ఇది 70 శాతం వేగవంతమైనదని పేర్కొంది. ఇప్పటివరకు ఇది 12 ఉత్పరివర్తనాలకు లోనైందని, కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్లపై ఈ అంశం ప్రభావం చూపుతుందని బ్రిటన్ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ పాట్రిక్ వాలన్స్ తెలిపారు.

కాగా, కరోనా నూతన స్ట్రెయిన్ రాకతో ఇప్పటివరకు వాడుతున్న మందులు, చికిత్స విధానం, వ్యాక్సిన్లు పనిచేస్తాయా? లేదా? అనే సందేహాలు ఏర్పడ్డాయి. దీనిపై యూరప్ ఆరోగ్య సంస్థ స్పందిస్తూ, ఇప్పటివరకు వ్యాప్తిలో ఉన్న వైరస్ రకాలకు, ఈ కొత్త రకానికి పెద్దగా తేడాలేదని పేర్కొంది.