వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ భామ

24-12-2020 Thu 21:31
  • వరుస విజయాలతో సాగుతున్న వరుణ్ తేజ్ 
  • కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తాజా చిత్రం
  • కథానాయికగా సయీ మంజ్రేకర్ ఎంపిక
  • బాక్సర్ గా నటిస్తున్న వరుణ్ తేజ్
Bollywood beauty finalized opposite Varuntej
మెగా ఫ్యామిలీ హీరోగా చిత్రసీమకు పరిచయమైనా.. ప్రతి సినిమాకూ కష్టపడుతూ.. ఆర్టిస్టుగా ఎదుగుతూ.. ఇప్పుడు ఓ స్థాయిని తెచ్చుకున్న హీరో వరుణ్ తేజ్. 'ఎఫ్ 2', 'గద్దలకొండ గణేశ్' సినిమాల వరుస విజయాలతో తన రేంజిని మరింత పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు తాను నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.

ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా కథాంశంతో రూపొందుతోంది. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తాడు. ఈ పాత్ర పోషణ కోసం ప్రత్యేకంగా బాక్సింగ్ లో తర్ఫీదు కూడా పొందాడు. ఇక ఈ సినిమాలో అతని సరసన కథానాయికగా ఎవరు నటిస్తారన్న విషయమై రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఎవరు ఖరారు అయ్యారన్నది ఇప్పుడు తేలిపోయింది.

ఇందులో బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ రినైజెన్స్ పిక్చర్స్ వెల్లడించింది. సయీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, చిత్రనిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురైన సయీ.. ఇప్పటికే అడివి శేష్ హీరోగా రూపొందుతున్న 'మేజర్' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.