Rashtrapathi Bhavan: రాష్ట్రపతి భవన్ కు కాంగ్రెస్ నేతల పాదయాత్ర.. మధ్యలోనే ప్రియాంక గాంధీ సహా పార్టీ నేతల అరెస్ట్

  • రాష్ట్రపతిని కలిసిన రాహుల్, ముగ్గురు నేతలు
  • 2 కోట్ల సంతకాల మెమొరాండం అందజేత 
  • చట్టాలు రద్దు చేసేంత వరకు రైతులు కదలరని స్పష్టీకరణ
  • ఉగ్రవాద ముద్రవేస్తున్నారని ప్రియాంక మండిపాటు
Priyanka Gandhi several congress leaders arrested on march to Rashtrapathi Bhavan

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసేందుకు రాష్ట్రపతి భవన్ కు పాదయాత్రగా వెళుతున్న ప్రియాంక గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా సేకరించిన రెండు కోట్ల మంది సంతకాలతో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ నేతల బృందం.. రాష్ట్రపతిని కలిసేందుకు ఈ రోజు ఉదయం బయల్దేరింది.

అయితే, పాదయాత్రకు అనుమతి లేదని పేర్కొంటూ కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీ, మరో ముగ్గురు నేతలను తప్ప అందరినీ బస్సులోకి ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మరోపక్క, సేకరించిన సంతకాల మెమొరాండంను రాహుల్ గాంధీ రాష్ట్రపతికి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతులు కదలరని, ఆందోళనలను ఆపబోరని రాహుల్ తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలు రైతులకు అండగా ఉంటాయన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని మండిపడ్డారు. వెంటనే పార్లమెంట్ ను సమావేశపరిచి చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అసమ్మతి వినిపిస్తే ఉగ్రవాదులంటున్నారు: ప్రియాంక గాంధీ

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తే చాలు.. అందులో ఉగ్రవాద కోణాలున్నాయన్న ముద్ర వేస్తున్నారని ప్రియాంక గాంధీ విమర్శించారు. రైతులకు తమ మద్దతుంటుందని చెప్పేందుకే రాష్ట్రపతి భవన్ కు పాదయాత్ర చేపట్టామన్నారు. ‘‘మనమంతా ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం.. వాళ్లంతా ప్రజలు ఎన్నుకున్న ఎంపీలు. రాష్ట్రపతిని కలిసే హక్కు వాళ్లకుంది. అందులో సమస్యేంటి?’’ అని ఆమె ప్రశ్నించారు. చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న లక్షలాది రైతుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు.  
   
కొవిడ్ ఉంది.. పాదయాత్రకు పర్మిషన్ లేదు: పోలీసులు

కేవలం అనుమతి ఉన్న నేతలనే రాష్ట్రపతి భవన్ కు వెళ్లేందుకు పంపించామని చాణక్యపురి ఏసీపీ ప్రగ్య చెప్పారు. రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్ర చేసేందుకు కాంగ్రెస్ కు అనుమతి లేదని న్యూ ఢిల్లీ అదనపు డీసీపీ దీపక్ యాదవ్ అన్నారు. అపాయింట్ మెంట్ తీసుకున్న ముగ్గురిని మాత్రమే పంపించామన్నారు. కొవిడ్ 19 తీవ్రతల దృష్ట్యా ప్రస్తుతం ఢిల్లీలో 144 సెక్షన్ అమల్లో ఉందని, జనం గుమిగూడేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు.

More Telugu News