Hanamkonda: అమెరికాలోని న్యూజెర్సీలో హన్మకొండ వాసి దుర్మరణం

Hanamkonda man died in america in rail accident
  • న్యూజెర్సీలో నాలుగేళ్లుగా ఉంటున్న ప్రవీణ్ కుమార్
  • ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్తుండగా రైల్వే స్టేషన్‌లో ఘటన
  • మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్న వినయ్ భాస్కర్
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ప్రమాదంలో తెలంగాణ వాసి దుర్మరణం పాలయ్యాడు. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన దేశిని ప్రవీణ్ కుమార్ (37) భార్య నవతతో కలిసి నాలుగేళ్లుగా న్యూజెర్సీలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ సాఫ్ట్‌వేర్  ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి మూడు సంవత్సరాల వయసున్న కుమారుడు ఉన్నాడు.

ఈ నెల 22న ప్రవీణ్ కుమార్ తాను ఉంటున్న ఎడిసన్ టౌన్‌షిప్ నుంచి న్యూయార్క్‌లోని కార్యాలయానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు రైలు కిందపడి మృతి చెందాడు. ఎడిసన్ స్టేషన్‌లో ట్రెంటాన్ నుంచి వస్తున్న నార్త్ ఈస్ట్ కారిడార్ రైలును ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అయితే, అంతకుమించిన వివరాలు తెలియరాలేదు.  ప్రవీణ్‌తోపాటు అక్కడే ఉంటున్న ఆయన బావమరిది ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు.

కుమారుడి మృతి వార్త తెలిసి అతడి తల్లిదండ్రులు రాజమౌళి, పుష్పలీల కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవీణ్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు అక్కడ ఉన్న అతడి స్నేహితులతో మాట్లాడుతున్నారు. ప్రవీణ్ మృతదేహాన్ని ప్రస్తుతం న్యూ జెర్సీలోని మిడిలెస్సెక్స్ రీజనల్ ఎగ్జామినర్‌లో ఉంచారు. కేటీఆర్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడి ప్రవీణ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇక్కడకు రప్పిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు.
Hanamkonda
Warangal Rural District
America
Train Accident

More Telugu News