K Kavitha: కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో గల్ఫ్ దేశాల్లో ఉన్న మన కార్మికులకు తీవ్ర నష్టం: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

  • గల్ఫ్ కార్మికుల కనీస వేతనాల్లో 40 శాతం కోత
  • కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన కవిత
  • 90 లక్షల మంది నష్టపోతారని వెల్లడి
  • ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
Kalvakuntla Kavitha responds to Gulf labour issues

గల్ఫ్ దేశాల్లో ఉన్న భారత కార్మికుల వేతనాల్లో 40 శాతం కోత విధించేలా కేంద్రం ఉత్తర్వులు చేసిందంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గల్ఫ్ దేశాల్లో 90 లక్షల మంది భారత కార్మికులు ఉన్నారని, తాజా ఉత్తర్వులతో వారికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వివరించారు. కార్మికుల కనీస దినసరి భత్యాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఇది తీవ్రమైన తిరోగమన చర్య అని విమర్శించారు. దీన్ని వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో, గల్ఫ్ దేశాల సంస్థలు ఇప్పుడు అధిక వేతనాలు అందుకుంటున్న వారిని తొలగించి తక్కువ వేతనాలకు కొత్తవారిని తీసుకునే ప్రమాదం ఉందని కవిత అభిప్రాయపడ్డారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో గల్ఫ్ కార్మికుల రక్షణకు అద్భుతమైన చట్టాలున్నాయని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు కార్మికులకు వ్యతిరేకం అని మరోసారి స్పష్టమైందని కవిత విమర్శించారు.

More Telugu News