Karnataka: కరోనా కొత్త వైరస్ భయాలు.. రాత్రిపూట కర్ఫ్యూ విధించిన కర్ణాటక!

  • జనవరి 2 వరకు నైట్ కర్ఫ్యూ విధించిన కర్ణాటక
  • యూకే నుంచి వచ్చేవారు ఆర్టీ-పీసీఆర్ చేయించుకోవాలని ఆదేశం
  • అందరూ సహకరించాలన్న యడియూరప్ప
Karnataka Night Curfew From 10 PM to 6 AM Until January 2

కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మామూలు కరోనాతో పోలిస్తే ఈ కొత్త స్ట్రెయిన్ 70 శాతం వేగంగా విస్తరిస్తోందని నిపుణులు చెపుతున్న నేపథ్యంలో, అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూని విధించారు.

ఈ క్రమంలో తాజాగా కర్ణాటకలో కూడా రాత్రి పూట కర్ఫ్యూని విధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. జనవరి 2 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని చెప్పారు. కొత్త స్ట్రెయిన్ ను గుర్తించిన అనంతరం మహారాష్ట్ర తర్వాత నైట్ కర్ప్యూ విధించిన రెండో రాష్ట్రం కర్ణాటక కావడం గమనార్హం.

ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యూకే నుంచి వచ్చే ప్రయాణికులందరూ 72 గంటల్లోగా తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని ఆదేశించింది. నైట్ కర్ఫ్యూకి ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు.

మరోవైపు కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ, యూకేలో గుర్తించిన కరోనా కొత్త వైరస్ ను కట్టడి చేసేందుకే నైట్ కర్ఫ్యూ విధిస్తున్నామని చెప్పారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను కూడా మానిటర్ చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకు రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి ఫంక్షన్లను, ఈవెంట్లను అనుమతించబోమని అన్నారు. క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ పై దీని ప్రభావం పడుతుందని తెలిపారు. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు జనవరి 1 నుంచి స్కూళ్లు ప్రారంభమవుతాయని తెలిపారు.

More Telugu News