Telangana: స్ట్రెయిన్ వైరస్.. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

  • విదేశాల నుంచి వస్తున్న వారి విషయంలో అప్రమత్తంగా ఉన్నామన్న అధికారులు
  • 24 గంటల్లో వచ్చిన వారికి ఎయిర్ పోర్టులోనే పరీక్షలు
  • వారం రోజుల్లో వచ్చిన వారికి పరీక్షల నిర్వహణ
TS govt making arrangements to curb spread of strain virus

యూకేలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ మన దేశంలో కూడా ఆందోళన పెంచుతోంది. కరోనాకు వ్యాక్సిన్ వస్తోందని... కొన్ని రోజుల్లో సమస్యలన్నీ తొలగిపోతాయని ప్రజలు భావిస్తున్న తరుణంలో... కొత్త స్ట్రెయిన్ రావడం కలకలం రేపుతోంది. కొత్త వైరస్ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. భారత్ కూడా యూకేపై ట్రావెల్ బ్యాన్ విధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

విదేశాల నుంచి హైదరాబాదుకు వస్తున్న వారి విషయంలో అప్రమత్తంగా ఉన్నామని శ్రీనివాస్ చెప్పారు.  కొత్త స్ట్రెయిన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు చేసిందని తెలిపారు. కొత్త స్ట్రెయిన్ లక్షణాలు ఉన్నవారి కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని చెప్పారు. 040-24651119 నంబరుకు బాధితులు ఫోన్ చేయవచ్చని తెలిపారు. గత 24 గంటల్లో రాష్ట్రానికి వచ్చిన వారందరికీ శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వారం రోజుల్లో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించి, పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

More Telugu News