Virat Kohli: ఇండియాకు బయల్దేరిన కోహ్లీ.. సిడ్నీలో క్వారంటైన్ లో ఉన్న రోహిత్

Kohli returns to India
  • ఈ వారంలో బిడ్డకు జన్మనివ్వనున్న అనుష్క
  • భార్య పక్కన ఉండాలనే ఉద్దేశంతో ఇండియాకు బయల్దేరిన కోహ్లీ
  • మిగిలిన మ్యాచ్ లకు కెప్టెన్సీ చేయనున్న రహానే
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. తన పర్యటనను ముగించుకున్న కోహ్లీ ఈ ఉదయం ఇండియాకు తిరుగుపయనమయ్యాడు. కోహ్లీ భార్య అనుష్కశర్మ గర్భవతి అనే విషయం తెలిసిందే. ఈ వారంలో ఆమెకు డెలివరీ కానుంది. ఈ తరుణంలో, కాన్పు సమయంలో తన భార్య పక్కనే ఉండాలనే ఉద్దేశంతో కోహ్లీ ఇండియాకు తిరిగి వస్తున్నాడు.

కోహ్లీ జట్టుకు దూరం కావడంతో మిగిలిన మూడు మ్యాచ్ లకు అజింక్యా రహానే కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. మరోవైపు ఇండియాకు బయల్దేరే ముందు జట్టు సభ్యులతో కోహ్లీ సమావేశమయ్యాడు. తొలి టెస్టులో ఘోర పరాభవం మూటకట్టుకున్న నేపథ్యంలో తన సహచరులకు మార్గనిర్దేశం చేశాడు. ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశాడు.

మరోవైపు ఇండియన్ స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ సిడ్నీలో క్వారంటైన్ లో ఉన్నాడు. కరోనా నేపథ్యంలో అతను ఎక్కడకూ వెళ్లకుండా తన గదికే పరిమితమయ్యాడు. రోహిత్ క్షేమంగా ఉన్నాడని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. రెండో టెస్టు తర్వాత రోహిత్ జట్టుతో కలవనున్నాడు.
Virat Kohli
Rohit Sharma
Team India
Australia

More Telugu News