Apple: ‘ప్రాజెక్ట్ టైటాన్’: యాపిల్ నుంచి డ్రైవర్ రహిత కారు!

  • 2024 నాటికి మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు
  • ‘యాపిల్ స్పెషల్ బ్యాటరీ’తో కార్ కు మెరుగులు
  • లిథియం అయాన్ కాకుండా ‘ఎల్ఎఫ్ ఫీ’ మోనోసెల్ బ్యాటరీలు
  • అటానమస్ డ్రైవింగ్ కోసం సొంతంగా ‘త్రీడీ లైడార్లు’
  • సప్లై చెయినే పెద్ద చాలెంజ్ అంటున్న నిపుణులు
The first Apple car may arrive in 2024

యాపిల్ నుంచి కొత్త ఐఫోన్ వస్తోందంటేనే ఆ ఫోన్ ప్రియులు ఎక్కడలేని ఆసక్తి చూపిస్తారు. ఫీచర్లేంటో, కెమెరా ఎట్లా ఉంటుందో, దాని ధర ఎంతో అనుకుంటూ లెక్కలేసుకుంటారు. అలాంటిది అసలు సంబంధమే లేని ఓ కొత్త ప్రొడక్ట్ ను యాపిల్ తీసుకొస్తోందంటే ‘ఔరా’ అని కళ్లు పెద్దవి చేసుకోరూ! ఇంతకీ ఆ ప్రొడక్ట్ ఏంటో తెలుసా.. కారు! అవును.. అక్షరాలా కారే! అది కూడా డ్రైవర్ అవసరం లేని అటానమస్ కార్. ప్రాజెక్ట్ టైటాన్ పేరుతో దానిని మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. 2024 నాటికి ఆ కార్ ను జనానికి పరిచయం చేయాలనుకుంటోంది.

ప్రాజెక్ట్ లో భాగమైన కొందరు నిపుణులు ఆ విషయాలను పంచుకున్నారు. ఈ కార్ లో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. స్పెషల్ బ్యాటరీ. ఇప్పుడున్న అన్ని కార్లలో వాడుతున్న బ్యాటరీలకు ఇది పూర్తి భిన్నం. దానిని యాపిల్ కంపెనీనే స్పెషల్ గా తయారు చేస్తోంది. మరి, ఈ యాపిల్ కారు, కొత్త బ్యాటరీ గురించి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం! 

నిజానికి 2014లోనే ప్రాజెక్ట్ టైటాన్ ను యాపిల్ ప్రారంభించింది. అయితే, మధ్యలో దానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ లో లోపాల వల్ల ప్రాజెక్ట్ ను కొన్నాళ్లు పక్కనపెట్టింది. దాని సాధ్యాసాధ్యాలను అంచనా వేసుకుంది. యాపిల్ కంపెనీ వెటరన్ ఎక్స్ పర్ట్ డజ్ ఫీల్డ్ ను 2018లో టెస్లా నుంచి యాపిల్ మళ్లీ తెచ్చేసుకుంది. 2019లో ప్రాజెక్ట్ లోని 190 మందిని తీసి పక్కనపెట్టేశారు. అప్పటి నుంచి ప్రాజెక్ట్ వేగం పుంజుకుంది. ప్రత్యర్థి కంపెనీ ఆల్ఫాబెట్ ఐఎన్ సీకి చెందిన వేమో డ్రైవర్ అవసరం లేని రోబో ట్యాక్సీలను తయారు చేయడంతో.. దానికి పోటీగా మరింత వేగంగా అటానమస్ కార్లను తయారు చేయాలన్న పట్టుదలతో యాపిల్ ఉన్నట్టు ఓ నిపుణుడు చెప్పారు.

స్పెషల్ బ్యాటరీ

అటానమస్ కార్ అనే చెబుతున్నా.. కారు బ్యాటరీపైనా యాపిల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సొంతంగా ‘మోనోసెల్’ అనే కొత్త టెక్నాలజీతో బ్యాటరీని తయారు చేస్తోంది. ఇప్పుడున్న బ్యాటరీల్లో అన్ని సెల్స్ విడివిడిగా ఉంటున్నాయి. అయితే, యాపిల్ టెక్నాలజీలో ఆ సెల్స్ అన్నింటినీ ఒకేదాంట్లో పెట్టేసి ‘మోనోసెల్’గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల కార్ లో బ్యాటరీకి స్థలం తగ్గడంతో పాటు.. ఎక్కువ దూరం కారు ప్రయాణించేందుకు కూడా వీలుంటుందని నిపుణులు అంటున్నారు. డిజైన్ మీద యాపిల్ దృష్టి పెట్టిందంటే ఒక్క చిన్న బ్యాటరీలో వీలైనన్ని ఎక్కువ యాక్టివ్ మెటీరియల్స్ ను పెట్టొచ్చని చెబుతున్నారు. దాని వల్ల కార్ ప్రయాణించే దూరం ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు.

ఇప్పటిదాకా ఉన్న లిథియం అయాన్ బ్యాటరీలు కాకుండా లిథియం ఫెర్రస్ (ఐరన్) ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్ పీ) బ్యాటరీలపై యాపిల్ రీసెర్చ్ చేస్తోందని ఒక ఎక్స్ పర్ట్ చెప్పారు. ఈ టెక్నాలజీ బ్యాటరీ అతిగా వేడెక్కదని, చాలా సేఫ్ అని, ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువ అని అంటున్నారు. మొదటి సారి ఐఫోన్ ను చూసినప్పుడు ఎలాంటి అనుభూతి అయితే కలుగుతుందో.. యాపిల్ బ్యాటరీ టెక్నాలజీని చూసినా అదే అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు. బ్యాటరీ టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. అంతేకాకుండా బ్యాటరీ ఖర్చునూ చాలా వరకు తగ్గిస్తుందంటున్నారు.

త్రీడీ లైడార్లు

అటానమస్ డ్రైవింగ్ కార్లలో లైడార్ సెన్సర్ల పాత్ర చాలా కీలకం. రోడ్డు మీద ట్రాఫిక్ ను అంచనా వేయడం, ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం వంటివి దీని ద్వారానే జరుగుతాయి. అలాంటి లైడార్ సెన్సర్లపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది యాపిల్. త్రీడీలో రోడ్డు కనిపించే లైడార్ సెన్సర్లపై యాపిల్ పనిచేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

వివిధ దూరాల్లోని వస్తువులు, ట్రాఫిక్ ను స్కాన్ చేసేందుకు ఎక్కువ లైడార్లను యాపిల్ వాడాలనుకుంటోంది. అందులో కొన్ని లైడార్ యూనిట్లను యాపిల్ కంపెనీనే తయారు చేయాలనుకుంటోంది. మరికొన్నింటి కోసం ఇప్పటికే కొన్ని కంపెనీలతో చర్చించినట్టు తెలుస్తోంది. మ్యాగ్నా ఇంటర్నేషనల్ ఐఎన్ సీ అనే కంపెనీతో కొద్ది రోజుల క్రితం చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే, దీనిపై మ్యాగ్నా నుంచి ఎలాంటి స్పందన లేదు. కాగా, ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రోలో లైడార్ సెన్సర్లను పెట్టింది యాపిల్.

సప్లై చెయిన్.. పెద్ద చాలెంజ్

కార్లను సరఫరా చేయడం తయారు చేసినంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే, నిధులు పుష్కలంగా ఉన్న యాపిల్ వంటి కంపెనీకి అది సులువే అయినా.. సవాళ్లతో కూడుకున్నదేనని అంటున్నారు. మార్కెటింగ్ సప్లై సెల్ ఫోన్లంత ఈజీ కాదని తేల్చి చెబుతున్నారు. టెస్లా వంటి కంపెనీకి లాభాల బాట పట్టడానికి 17 ఏళ్లు పట్టిందని, మొదట్లో సరఫరా చెయిన్లలో ఆ కంపెనీకీ సవాళ్లు ఎదురయ్యాయని గుర్తు చేస్తున్నారు.

కార్ల నిర్మాణం, విడిభాగాల అసెంబ్లీ వంటి విషయాల్లో యాపిల్ భాగస్వాములపైనే ఆధారపడుతుందని ప్రాజెక్ట్ లో భాగమైన కొందరు నిపుణులు వివరిస్తున్నారు. అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్ కు సంబంధించి కార్లను తయారు చేసే వివిధ కంపెనీలతో జట్టు కడితే బాగుంటుందని సూచిస్తున్నారు. లాభాలు రావాలంటే పెద్ద మొత్తంలో కార్లను తయారుచేసేలా ఆటోమొబైల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్స్ ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారని, అది కార్ల మార్కెట్ లోకి కొత్తగా అడుగుపెడుతున్న యాపిల్ వంటి కంపెనీలకు సవాలేనని అంటున్నారు.

ఒక్క అసెంబ్లీ ప్లాంట్ లో ఏటా లక్ష వాహనాలను తయారు చేయాల్సి ఉంటుందని, ఆ సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే, యాపిల్ ఎంత గట్టిగా ప్రయత్నించినా.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రొడక్షన్ 2025లోనే జరగొచ్చని చెబుతున్నారు. లేదా ఆ టైం కూడా దాటొచ్చంటున్నారు.

కాగా, డ్రైవర్ లేని కార్ల తయారీపై యాపిల్ చాలా సీరియస్ గా పనిచేస్తోందన్న కథనాల నేపథ్యంలో ఆ కంపెనీ షేర్ విలువ 1.24 శాతం మేర పెరిగింది. అదే సమయంలో ఎస్ అండ్ పీ 500లోకి అడుగుపెట్టిన తొలి రోజే టెస్లా షేర్ విలువ 6.5 శాతం పడిపోయింది.

More Telugu News