Don Bradman: డాన్ బ్రాడ్ మన్ తొలి టెస్ట్ క్యాప్ కు భారీ ధర.. వేలంలో ‘క్రైమ్’ ట్విస్ట్

  • రూ. రెండున్నర కోట్లు పెట్టి దక్కించుకున్న ఆస్ట్రేలియా వ్యాపారి పీటర్ ఫ్రీడ్ మన్
  • డాన్ గొప్పతనాన్ని తెలియజెప్పేందుకు క్యాప్ ను ఆస్ట్రేలియా మొత్తం తిప్పుతానన్న పీటర్
  • 1959లో ఆ క్యాప్ ను ఇంటి పక్కనే ఉండే ఫ్రెండ్ దున్హమ్ కు ఇచ్చిన బ్రాడ్ మన్
Cricket legend Don Bradmans debut test cap sold for 340000 usd

సర్ డాన్ బ్రాడ్ మన్.. ఆ పేరే క్రికెట్ లో ఓ సంచలనం. టెస్టు క్రికెట్ లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన దిగ్గజం. అలాంటి వ్యక్తికి సంబంధించిన వస్తువును ఇచ్చేస్తామంటే ఎవరు మాత్రం వద్దంటారు! అలాగని ఫ్రీగా కూడా ఇచ్చేయలేదు. ఆస్ట్రేలియా అధికారులు వేలం వేశారు. ఇక్కడ మరో విశేషం కూడా వుంది. ఓ వ్యక్తి చేసిన నేరం.. ఆయన క్యాప్ ను వేలం వేసే దాకా తీసుకొచ్చింది. ఇంతకీ ఆ నేరం ఏంటి? ఎవరు చేశారు? అతడు నేరం చేస్తే బ్రాడ్ మన్ క్యాప్ ను ఎందుకు వేలం వేశారు? అనేది ఆసక్తికరం.

ఆ వివరాలలోకి వెళితే, తొలి టెస్టు మ్యాచ్ లో బ్రాడ్ మన్ పెట్టుకున్న ‘ఆకుపచ్చని బ్యాగీ క్యాప్’ను ఆస్ట్రేలియాకు చెందిన వ్యాపారి, రోడ్ మైక్రోఫోన్స్ అధినేత పీటర్ ఫ్రీడ్ మన్ వేలంలో రూ. రెండున్నర కోట్లు (3.4 లక్షల అమెరికన్ డాలర్లు) పెట్టి దక్కించుకున్నారు. క్రికెట్ కు సంబంధించి స్మారక చిహ్నాలుగా దాచి పెట్టిన వస్తువుల్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో వస్తువు బ్రాడ్ మన్ మొదటి టెస్ట్ క్యాప్. అంతకుముందు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ టెస్ట్ క్యాప్.. రికార్డ్ స్థాయిలో సుమారు రూ.5.6 కోట్లకు (7.6 లక్షల డాలర్లు) అమ్ముడైంది.

వేలంలో చిన్న ట్విస్ట్..

1928 నవంబర్ లో బ్రాడ్ మన్ టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మ్యాచ్ కు ముందు కొత్తగా జట్టులోకి వచ్చినోళ్లకు టీమ్ కెప్టెన్ క్యాప్ ఇవ్వడం ఆనవాయితీ. అలాగే బ్రాడ్ మన్ కూ ఇచ్చారు. అయితే, బ్రాడ్ మన్ ఆ క్యాప్ ను 1959లో అడిలైడ్ లోని తన ఇంటి పక్కనే నివసించే ఫ్యామిలీ ఫ్రెండ్ పీటర్ దున్హమ్ కు ఇచ్చారు. ఇన్వెస్టర్లను పది లక్షల డాలర్లకు ముంచాడన్న నేరంపై దున్హమ్ కు కోర్టు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

దున్హమ్ కు శిక్ష పడింది సరేగానీ.. మరి, అతడి చేతిలో మోసపోయిన తమ పరిస్థితేంటని బాధితులు ప్రశ్నించారు. బ్రాడ్ మన్ ఇచ్చిన క్యాప్ ను వేలం వేయాలని డిమాండ్ చేశారు. అలా వచ్చిన డబ్బులను అందరికీ పంచాలని కోరారు. అందుకు ఒప్పుకున్న దున్హమ్ ఎస్టేట్ ట్రస్టీ క్యాప్ ను వేలం వేసింది. పీటర్ ఫ్రీడ్ మన్ క్యాప్ ను దక్కించుకున్నారు.

అయితే, అంత ధర చెల్లించి కొనుక్కున్న ఆ క్యాప్ ను ఫ్రీడ్ మన్ ఇంట్లో దాచిపెట్టుకోడట. ఆ గొప్ప బ్యాట్స్ మన్ గురించి అందరికీ తెలియజెప్పేలా క్యాప్ ను ఆస్ట్రేలియా అంతటా తిప్పి ప్రదర్శిస్తానని అంటున్నాడు. ఇక, అంతకుముందు 1993లో నిర్వహించిన నిర్వాణా ప్రోగ్రామ్ లో కర్ట్ కొబాయిన్ వాడిన గిటార్ ను ఈ ఏడాది జూన్ లో సుమారు రూ.50.25 కోట్లకు (68 లక్షల అమెరికన్ డాలర్లు) ఫ్రీడ్ మన్ దక్కించుకున్నారు.

కాగా, 1928 నుంచి 1948 వరకు 20 ఏళ్ల పాటు బ్రాడ్ మన్ ఆస్ట్రేలియా క్రికెట్ కు సేవలందించారు. 52 టెస్ట్ మ్యాచ్ లాడిన ఆయన.. 99.94 బ్యాటింగ్ సగటుతో ఏ క్రికెటర్ కూ అందనంత ఎత్తులో నిలిచారు. 1949లో టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు.

More Telugu News