UK: మన దేశంలోనూ ‘బ్రిటన్ కరోనా’.. కొట్టిపారేయలేమంటున్న నిపుణులు

  • దాన్ని గుర్తించడమే అతిపెద్ద సవాల్ అని ఆందోళన
  • ఆర్టీపీసీఆర్ ద్వారా గుర్తించే అవకాశాలు తక్కువే
  • కొత్త టెస్టుల దిశగా రీసెర్చ్ లు చేస్తున్న మైక్రోబయాలజిస్టులు
  • పాజిటివ్ శాంపిళ్లలో ‘ఎస్’ జన్యువు లేని వాటిపై దృష్టి
  • దక్షిణాఫ్రికాలోని కొత్త స్ట్రెయిన్ కూడా ముప్పేనంటున్న మహారాష్ట్ర కొవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు
Cant rule out UKs new virus variant presence in India

బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో కొంత మంది దాని బారిన పడ్డారు కూడా. మరి, మన దేశంలో పరిస్థితేంటి? మన దగ్గర కూడా దాని ఆనవాళ్లున్నాయా? ఎవరికైనా అది సోకిందా? అంటే.. ఆ మహమ్మారి మన దగ్గర కూడా వ్యాపించి ఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

‘బ్రిటన్ కరోనా’ మన దగ్గరా ఉండే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అయితే, దాన్ని గుర్తించడమే ఇప్పుడు సవాల్ అని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీపీసీఆర్ టెస్టుల ద్వారా ఈ కొత్త రకం కరోనాను గుర్తించే అవకాశాలు తక్కువంటున్నారు. అందుకే దాని ఆనవాళ్లను గుర్తించే పనిలో కొందరు డాక్టర్లు, మైక్రోబయాలజిస్టులు బిజీగా వున్నారు. సెప్టెంబర్ నుంచి చేస్తున్న టెస్టుల తాలూకు పాజిటివ్ శాంపిళ్లను తెప్పించి కొత్త స్ట్రెయిన్ ను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

ముంబై కస్తూర్బా హాస్పిటల్ లోని బీఎంసీ మాలిక్యులార్ డయాగ్నస్టిక్స్ లేబొరేటరీ నిపుణులు.. సెప్టెంబర్ నుంచి తీసుకున్న శాంపిళ్లను సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కరోనాలోని ‘ఎస్’ జన్యువు ఆనవాళ్లు లేని శాంపిళ్ల లెక్క తేలుస్తున్నామని ఆ ల్యాబ్ హెడ్ డాక్టర్ జయంతీ శాస్త్రి చెప్పారు. ఎస్ జన్యువు లేదని తేలిన శాంపిళ్లలోని దాని జన్యు క్రమాల గురించి మరింత తెలుసుకునేందుకు పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపుతామని తెలిపారు.

ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా కరోనా వైరస్ లోని ఎన్, ఎస్, ఓఆర్ఎఫ్ జన్యువులతో మరిన్ని జన్యువులను గుర్తించడం ద్వారా కొవిడ్19 సోకిందో లేదో తేలుస్తారు. వాటిలో ఏ రెండు జన్యువుల ఆనవాళ్లు కనిపించినా కొవిడ్19 పాజిటివ్ గా రిపోర్ట్ ఇస్తారు. అయితే, బ్రిటన్ లో బయటపడిన కొత్త స్ట్రెయిన్ లో మాత్రం ఎస్ జన్యువు ఆనవాళ్లు కనిపించట్లేదు. అందుకే ప్రస్తుతం ‘ఎస్’ను టార్గెట్ చేసుకుని రీసెర్చ్ చేస్తున్నారు.

బ్రిటన్ లో సెప్టెంబర్ నుంచి నమోదవుతున్న కేసుల్లో 62 శాతం ఈ కొత్త స్ట్రెయిన్ వల్ల నమోదైనవే. దీని వల్ల టెస్టుల్లో కచ్చితత్వం లోపించిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా, ఇటలీ, ఐస్ ల్యాండ్, డెన్మార్క్ లలోనూ కొన్ని కేసులొచ్చాయి. కాగా, దక్షిణాఫ్రికాలో కనిపించిన కొత్త రకం కరోనా కూడా చాలా వేగంగా వ్యాపిస్తున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన కొవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి చెప్పారు.

More Telugu News