WHO: ఇప్పటికే చాలా దేశాల్లో కొత్త కరోనా: డబ్ల్యూహెచ్ఓ

Mutated Virus in Many Countries says WHO Scientist Soumya Swaminathan
  • బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన మ్యూటేషన్ చెందిన వైరస్
  • సాధారణ కరోనాతో పోలిస్తే 70 శాతం అధిక ప్రభావం
  • ఎన్నో దేశాల్లో ఉండే ఉంటుందన్న డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్
రూపును మార్చుకున్న మహమ్మారి కరోనా, ప్రస్తుతం బ్రిటన్ లో కనిపిస్తున్నప్పటికీ, ఇప్పటికే చాలా దేశాల్లో ఉండే ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. ఈ వైరస్ ప్రపంచమంతా ఇప్పటికే వ్యాపించి వుంటుందని తెలిపిన ఆమె, ఈ వైరస్ గత సంవత్సరం వెలుగు చూసిన కరోనా వైరస్ కన్నా 70 శాతం అధిక ప్రభావవంతమైనదని చెప్పడానికి ఆధారాలు లేవని అన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గణాంకాలు అలా కనిపిస్తున్నా, పరిస్థితి అంత తీవ్రంగా ఉండక పోవచ్చని అన్నారు.

"జీనోమ్ సీక్వెన్సింగ్ పై పరిశోధనలు చేయడంలో యూకే ప్రపంచంలోనే ముందున్న దేశాల్లో నిలిచింది. ఎంతో తక్కువ సమయంలో యూకే శాస్త్రవేత్తలు వైరస్ ల జన్యు నమూనాలను తేలుస్తారు. ఇదే సమయంలో తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఎన్నో దేశాలు ఇంకా పరిశీలించలేదని అనుకుంటున్నాను. ఒకవేళ పరిశీలించి వుంటే, జన్యుక్రమాన్ని మార్చుకున్న వైరస్ అక్కడ కూడా కనిపిస్తుంది. లేకుంటే, మరో తరహాలో మారి ఉంటుంది" అని ఆమె వ్యాఖ్యానించారు.

కాగా, కొత్త వైరస్ ను ఇటలీలోనూ కనుగొన్నామని ఆదివారం నాడు బ్రిటన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా జన్యు కోడ్ తో పోలిస్తే, దీనిలో 17 శాతం వ్యత్యాసం ఉందని కూడా పేర్కొంది. ఇదే సమయంలో డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ తదితర దేశాల్లోనూ ఇదే తరహా కేసులు నమోదు కావడంతో ప్రపంచమంతా తీవ్ర ఆందోళన నెలకొంది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన డాక్టర్ స్వామినాథన్, ఈ కొత్త వైరస్ పై మరిన్ని పరిశోధనలు చేయాల్సి వుందని అన్నారు.

జీనోమ్ సీక్వెన్సింగ్ ను తేల్చే విషయంలో ఇండియా చాలా అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించిన ఆమె, అక్కడ దీనిపై విస్తృత పరిశోధనలు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. కరోనా ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనే వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు ఈ పరిశోధనలు ఉపకరిస్తాయని తెలిపారు. మిగతా అన్ని దేశాలు కూడా కరోనా కట్టడికి కలసికట్టుగా నడవాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.
WHO
Soumya Swaminathan
Corona Virus

More Telugu News