Corona Virus: యూకే నుంచి రోజుకు 600 మంది హైదరాబాద్‌కు.. వివరాలు సేకరించి అప్రమత్తం చేస్తున్న ప్రభుత్వం

Telangana govt taken steps amid new corona virus strain
  • శరవేగంగా విస్తరిస్తున్న కరోనా స్ట్రెయిన్
  • గత వారం రోజులుగా వచ్చిన వారి వివరాలు సేకరణ
  • ట్రాకింగ్ అనంతరం క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం
  • రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్రిటన్ నుంచి రోజుకు రెండు విమానాలతోపాటు 11 వరకు కనెక్టడ్ విమానాలు హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతున్నాయి. వీటి ద్వారా రోజుకు దాదాపు 600 మంది వరకు హైదరాబాద్ చేరుకుంటున్నారు. కొత్త కరోనా వైరస్ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ గత వారం రోజులుగా హైదరాబాద్ చేరుకున్న వారి వివరాలను విమానాశ్రయ వర్గాల ద్వారా సేకరించింది.  ఇప్పుడు వారిని ట్రాక్ చేసే పనిలో పడింది.

ట్రాకింగ్‌లో దొరికిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో చేరవేసి వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించింది. అంతేకాదు, బ్రిటన్ నుంచి వచ్చే వారి చుట్టుపక్కల నివసించే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్త వైరస్ ముప్పు నేపథ్యంలో కొవిడ్ టెస్టులు విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించింది. విదేశాల నుంచి వచ్చేవారి పాస్‌పోర్టులో స్టాంపింగ్ ఆధారంగా గత కొన్ని రోజులుగా వారు ఏయే దేశాల్లో పర్యటించారో తెలుసుకుని, తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.  

మరోవైపు, బ్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త  స్ట్రెయిన్ శరవేగంగా విస్తరిస్తుండడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అంతర్జాతీయ విమానాల ద్వారా వచ్చే ప్రయాణికుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే, వారంతా తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని కోరింది. పాజిటివ్‌గా తేలిన వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు పంపాలని, నెగటివ్ వచ్చిన వారిని ఇంటికి పంపించి వైద్య సిబ్బందితో పర్యవేక్షించాలని సూచించింది.
Corona Virus
Britain
virus mutation
Hyderabad
Airport
Telangana

More Telugu News