Motilal Vora: కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోరా కన్నుమూత

  • ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న వోరా
  • ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిక
  • వెంటిలేటర్ పై చికిత్స
  • పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ
Congress senior leader Motilal Vora is no more

కాంగ్రెస్ కురువృద్ధుడు మోతీలాల్ వోరా కన్నుమూశారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. నిన్న ఆయన పుట్టినరోజు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న మోతీలాల్ వోరా మూత్రనాళ సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. ఆయనకు ఢిల్లీలోని ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. వెంటిలేటర్ పై ఉన్న ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. మోతీలాల్ వోరా అంత్యక్రియలు స్వరాష్ట్రం చత్తీస్ గఢ్ లో నిర్వహించనున్నారు.

సీనియర్ రాజకీయ వేత్త వోరా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మోతీలాల్ వోరా కాంగ్రెస్ సీనియర్ నేతల్లో అపారమైన పాలనా అనుభవం ఉన్నవాడని మోదీ కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.

మోతీలాల్ వోరా తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులు చేపట్టారు. మధ్యప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్ కు గవర్నర్ గా పనిచేశారు. అంతేకాదు, కాంగ్రెస్ కు ఏకంగా 16 ఏళ్ల పాటు కోశాధికారిగా వ్యవహరించారు.

వోరా మృతిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఆయన నిజమైన కాంగ్రెస్ వాది అని కీర్తించారు. ఎంతో మంచి వ్యక్తి అని, మోతీలాల్ వోరా సేవలను ఎంతగానో కోల్పోతున్నామని తెలిపారు.

More Telugu News