BJP: బీజేపీని ఇక చీల్చి చెండాడుతాం: గూర్ఖా జనముక్తి మోర్చా నేత బిమల్ గురుంగ్

  • మూడోసారీ మమతను ముఖ్యమంత్రిని చేస్తాం
  • గూర్ఖా జాతి మొత్తాన్ని బీజేపీ మోసం చేసింది
  • టీఎంసీ అండతో బీజేపీని ఎన్ కౌంటర్ చేస్తాం
  • మూడేళ్ల తర్వాత డార్జిలింగ్ కు
We tore BJP will support TMC warns GJM leader Bimal Gurung

బెంగాల్ లో జరగబోయే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కే మద్దతిస్తామని గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) నేత బిమల్ గురుంగ్ మరోసారి తేల్చి చెప్పారు. గూర్ఖాలను మోసం చేసినందుకు, ప్రజల సమయాన్ని పన్నెండేళ్ల పాటు వృథా చేసినందుకు బీజేపీని చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. మూడేళ్ల తర్వాత ఆదివారం తొలిసారి డార్జిలింగ్ హిల్స్ కు వచ్చిన ఆయన.. చౌక్ బజార్ ప్రాంతంలో సభ నిర్వహించారు.

తమ మద్దతుతోనే ఉత్తర బెంగాల్ లో 49 సీట్లు గెలిచేందుకు బీజేపీ ప్లాన్ చేసిందని ఆయన అన్నారు. కానీ, తాము మాత్రం మూడోసారీ మమతను ముఖ్యమంత్రిని చేసి చూపిస్తామన్నారు. బీజేపీ లేకుంటే పోలీసులు తనను ఎన్ కౌంటర్ చేసేవారన్న బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. టీఎంసీ అండతో బీజేపీని తాను ఎన్ కౌంటర్ చేస్తానని హెచ్చరించారు. బీజేపీ తనను మాత్రమే మోసం చేయలేదని, గూర్ఖా జాతి మొత్తాన్ని వంచించిందని మండిపడ్డారు. దానికి గూర్ఖాలు కచ్చితంగా బదులు తీర్చుకుంటారని అన్నారు.

సభ తర్వాత మీడియాతోనూ మాట్లాడిన గురుంగ్.. తన ప్రత్యర్థులైన బినయ్ తమంగ్, అనిత్ థాపాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరో పదిహేను రోజుల్లో వాళ్లిద్దరూ డార్జిలింగ్ వదిలిపెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలపై బినయ్, అనిత్ మద్దతుదారులు మండిపడ్డారు. గురుంగ్ కు వ్యతిరేకంగా డార్జిలింగ్ లో ర్యాలీకి పిలుపునిచ్చారు.

కాగా, 2017 గూర్ఖాల్యాండ్ ఆందోళనల్లో భాగంగా జరిగిన హింసలో ఓ పోలీస్ అధికారి మరణించారు. ఆ ఏడాది సెప్టెంబర్ లోనే గురుంగ్ తన అనుచరుడు రోషన్ గిరితో కలిసి డార్జిలింగ్ నుంచి పారిపోయారు. అప్పట్లో గురుంగ్ పై 120కిపైగా కేసులు నమోదయ్యాయి.

More Telugu News