BJP: బీజేపీ తీరుపై రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంటి ముందు టీఎంసీ దీక్ష

  • ఫ్లెక్సీల్లో ఠాగూర్ ఫొటోపై అమిత్ షా ఫొటో పెట్టడంపై ఆగ్రహం
  • బయటివ్యక్తులొచ్చి అవమానిస్తే సహించబోమంటూ నిరనసలు
  • ఖండించిన బీజేపీ.. ఫ్లెక్సీలతో తమకే సంబంధం లేదని వెల్లడి
  • తమను అప్రతిష్ట పాల్జేసేందుకు టీఎంసీనే పెట్టిందని ఆరోపణ

TMC protests over Amit Shah flex hoardings in Shantiniketan

నోబెల్ గ్రహీత, ప్రముఖ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటి ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫ్లెక్సీలు పెట్టడంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు మండిపడ్డారు. అందుకు నిరసనగా కోల్ కతా శివారు జొరాసంకోలోని ఠాగూర్ జన్మించిన ఇంటి ముందు ఆదివారం దీక్ష చేపట్టారు. అమిత్ షా బెంగాల్ టూర్ నేపథ్యంలో శుక్రవారం శాంతినికేతన్ లోని ఠాగూర్ ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో.. ఠాగూర్ ఫొటోపైన అమిత్ షా ఫొటోను పెట్టారు. దీనిపై టీఎంసీతో పాటు లెఫ్ట్ పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు.

ఈ క్రమంలోనే ఆదివారం టీఎంసీ లీడర్లు, ఆ పార్టీ విద్యార్థి విభాగం నేతలు ప్లకార్డులు పట్టుకుని బీజేపీ తీరుపై నిరసనలు చేశారు. టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ ఠాగూర్ రచించిన గీతాలను ఆలపించారు. ‘బయటి వ్యక్తులు ఠాగూర్ ను అవమానిస్తే సహించం’, ‘ఒమిట్ షా' (అమిత్ షా పేరుకు వ్యంగ్యంగా) అంటూ ఆ పార్టీ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

‘‘శాంతినికేతన్, బోల్ పూర్ లో ఇలాంటి హోర్డింగులు పెట్టి ఠాగూర్ ను బీజేపీ అవమానించింది. బెంగాల్ ప్రజల సెంటిమెంట్లను దెబ్బతీసింది’’ అని బెంగాల్ మంత్రి శశి పంజా ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మరోపక్క, టీఎంసీ వ్యాఖ్యలను బీజేపీ నేత ప్రతాప్ బెనర్జీ ఖండించారు. ఆ హోర్డింగులను తమ పార్టీ నేతలు పెట్టలేదని, వాటితో తమకే సంబంధం లేదని అన్నారు. బిర్భూమ్ లో అమిత్ షా పర్యటన నేపథ్యంలో తమను అప్రతిష్ట పాల్జేసేందుకు టీఎంసీ నేతలే వాటిని ఏర్పాటు చేశారని ఆరోపించారు. హోర్డింగుల విషయం తమ దృష్టికి రాగానే వాటిని తీసేయించామని చెప్పారు. బెంగాల్ సాంస్కృతిక మూర్తుల పట్ల బీజేపీకి ఎనలేని గౌరవం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News