India: ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాం: సౌదీ అరేబియా

  • 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
  • తమ ప్రణాళికలు సరైన దారిలో సాగుతున్నాయి
  • ప్రాధాన్యతా రంగాలను గుర్తిస్తున్నామన్న రాజు బిన్ సల్మాన్
Heavy Investments in India Says Saudi King

ప్రపంచంలోనే అత్యధికంగా ముడి చమురును ఎగుమతి చేస్తున్న దేశంగా ఉన్న సౌదీ అరేబియా, సమీప భవిష్యత్తులో ఇండియాలో లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఇండియాలో తమ ఇన్వెస్ట్ మెంట్స్ కు సంబంధించిన ప్రణాళికలన్నీ సాగుతున్నాయని, కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించే సత్తా ఇండియాకు ఉందని సౌదీ రాజు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అభిప్రాయపడ్డారు. పెట్రోకెమికల్స్, రిఫైనరీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్, మ్యాన్యుఫాక్చరింగ్, అగ్రికల్చర్ తదితర రంగాల్లో 100 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను ఇండియాలో పెట్టనున్నామని ఆయన ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే ప్రకటించారు.

తాజాగా ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ, "ఇండియాలో పెట్టుబడులు పెట్టాలన్న మా ప్రణాళికలు సరైన దిశలోనే సాగుతున్నాయి. ప్రాధాన్యతాపూర్వక రంగాలను గుర్తించేందుకు ఇరు దేశాలూ కృషి చేస్తున్నాయి. ఈ దిశగా చర్చలు కూడా సాగుతున్నాయి" అన్నారు. తమకు వ్యూహాత్మక భాగస్వామిగా, సన్నిహిత దేశంగా ఇండియాను ఎన్నడో గుర్తించామని పేర్కొన్న ఆయన, నాలెడ్జ్ షేరింగ్, ఉగ్రవాదంపై పోరాటం, రక్షణ, భద్రత తదితర విభాగాల్లో భాగస్వామ్య ఒప్పందాలు కుదరనున్నాయని తెలిపారు.

మహమ్మారి బాధిస్తున్న సమయంలో తిరిగి వేగంగా నిలదొక్కుకునేందుకు ఇండియా ఎన్నో చర్యలు తీసుకుందని వ్యాఖ్యానించిన బిన్ సల్మాన్, ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఎకానమీగా, దక్షిణాసియాలో నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియాతో భాగస్వామ్యం తమకూ లాభిస్తుందని అన్నారు. కాగా, ఇటీవల సౌదీలో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే పర్యటించిన సంగతి తెలిసిందే. ఆదివారం నాడు ఆయన రాయల్ సౌదీ ఫోర్సెస్ కమాండర్ జనరల్ ఫహ్ద్ బిన్ అబ్దుల్లా మొహమ్మద్ అల్ ముతీర్ తో చర్చలు కూడా జరిపారు. భారత ఆర్మీ జనరల్ హోదాలో ఉన్న వ్యక్తి సౌదీలో పర్యటించడం ఇదే తొలిసారి.

More Telugu News