తాలిబన్ ఉగ్రవాదులతో ఆఫ్ఘాన్ సైన్యం పోరు.. 74 మంది ఉగ్రవాదుల హతం

21-12-2020 Mon 06:54
  • శాంతి చర్చలు కొనసాగుతున్నా ఆగని దాడులు
  • కాందహార్ సరిహద్దులో ఘర్షణ
  • ఈ వారం మొదట్లో 82 మంది ఉగ్రవాదుల హతం
Afghanisthan forces killed 74 Taliban Terrorists
బాంబు పేలుళ్లు, తుపాకుల మోతతో నిత్యం దద్దరిల్లే ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి నెలకొల్పేందుకు అక్కడి ప్రభుత్వం తాలిబన్లతో చర్చలు జరుపుతోంది. సెప్టెంబరులో ఖతర్‌లో ప్రారంభమైన చర్చలు కొనసాగుతున్నాయి. దీంతో తుపాకుల మోతకు తెరపడుతుందని అందరూ ఆశించారు. అయితే, దేనిపని దానిదే అన్నట్టు చర్చలు కొనసాగుతున్నా తాలిబన్లు మాత్రం తమ కార్యకలాపాలను విడిచిపెట్టడం లేదు. మరోవైపు, ఆఫ్ఘాన్ సైన్యం కూడా ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాలు కొనసాగిస్తోంది.

ఫలితంగా తాలిబన్, సైన్యం మధ్య సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా కాందహార్ ప్రావిన్స్‌లో జరిగిన ఘర్షణలో ఆఫ్ఘాన్ సైన్యం 74 మంది తాలిబన్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ప్రావిన్సులోని ఝెరియా, దాండ్, పాంజ్వీ, అర్ఘన్‌దాబ్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో వీరు హతమైనట్టు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ స్థావరాలపైకి తాలిబన్ ఉగ్రవాదులు దాడికి పాల్పడేందుకు సిద్ధం కాగా, ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ ఆర్మీ కాల్పులు ప్రారంభించింది.

ఈ ఘటనలో 74 మంది ఉగ్రవాదులు హతమవగా, 15 మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వారం మొదట్లో జరిగిన మిలటరీ ఆపరేషన్లలో 82 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమైనట్టు రక్షణ మంత్రిత్వ శాఖ గణాంకాలను బట్టి తెలుస్తోంది.