Sonu Sood: సోనూ సూదా మజాకా.... 'ఆచార్య'లో చిరంజీవితో తన్నులు తినే సీన్ల మార్పు

Sonu Sood scenes in Acharya movie will be changed
  • కరోనా పరిస్థితుల్లో సోనూ సూద్ కు హీరో ఇమేజ్
  • సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేసే సోనూ సూద్
  • చిరంజీవి ఆచార్యలోనూ అదే తరహా పాత్ర
  • మారిన ఇమేజ్ నేపథ్యంలో ఆచార్య స్క్రిప్టులో మార్పులు
  • సోనూ సూద్ ను కొడితే ప్రజలు శపిస్తారన్న చిరంజీవి
దేశంలో కరోనా వ్యాప్తి పరిస్థితుల్లో నటుడు సోనూ సూద్ నిజంగా ఆపద్బాంధవుడే అయ్యాడు. వలసజీవులను ఖర్చుకు వెనుకాడకుండా వారి స్వస్థలాలకు చేర్చడమే కాదు, విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని కూడా విమానాల్లో రప్పించాడు. ఏకవ్యక్తి సైన్యంలా పనిచేసిన సోనూ సూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పుడాయన ఇమేజ్ ఆకాశాన్నంటుతోంది. అందుకు నిదర్శనమే ఈ ఘటన.

ప్రస్తుతం సోనూ సూద్ ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో సోనూ సూద్ ను చిరంజీవి కొట్టే సీన్ తో పాటు, సోనూ సూద్ పై చిరంజీవి కాలుపెట్టే సీన్ కూడా ఉంది. సోనూ సూద్ కు ప్రజల్లో హీరో ఇమేజ్ ఉన్న నేపథ్యంలో ఆ సీన్లు చేయడం సబబు కాదని మెగాస్టార్ చిరంజీవి భావించారు. ఆ మేరకు స్క్రిప్టులో మార్పులు చేశారు.

దీనిపై సోనూ సూద్ స్పందించారు. "ఈ సినిమాలో మీరు ఉండడం పెద్ద సమస్య అని చిరంజీవి గారు అన్నారు. యాక్షన్ సీన్లలో మిమ్మల్ని కొట్టలేని పరిస్థితి ఏర్పడింది అని తెలిపారు. ఒకవేళ నన్ను ఆయన కొడితే ప్రజలు శాపనార్థాలు పెడతారని చెప్పారు. అందుకే నాకు సంబంధించిన సీన్ల స్క్రిప్టు మార్చడమే కాదు, రీషూట్ కూడా చేస్తున్నారు" అని సోనూ సూద్ వివరించారు.

అంతేకాదు, గతంలో ప్రతినాయక పాత్రలు పోషించిన తనను ఇప్పుడందరూ హీరో పాత్రలు వేయాలని కోరుతున్నారని సోనూ సూద్ వెల్లడించారు. తననే హీరోగా చేసి చిత్రాలు నిర్మించేందుకు అనేకమంది ముందుకొస్తున్నారని వివరించారు.
Sonu Sood
Acharya
Chiranjeevi
Scenes
Reshoot
Corona Virus
Pandemic
Lockdown

More Telugu News