Corona Virus: టీకా విషయంలో తెలంగాణ సర్కారుకు సహకరించని ప్రైవేటు ఆసుపత్రులు!

  • టీకా రాగానే వైద్యులకే ప్రాధాన్యం
  • ఇంకా పేర్లు ఇవ్వని ప్రైవేటు ఆసుపత్రులు
  • తమకే టీకా డోస్ లు ఇవ్వాలంటున్న హాస్పిటల్స్
  • పక్కదారి పడుతుందంటున్న ప్రభుత్వం
Non Cooperative Private Hospitals in Telangana Over Vaccine

కరోనా టీకాను ఇచ్చే విషయంలో తమ ప్రాధాన్యతలను కాపాడాలని కోరుకుంటున్న తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రులు, ఇప్పటివరకూ తమ వద్ద పని చేస్తున్న వైద్య సిబ్బందికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. కరోనా టీకా వస్తే, తమ కోటా తమకు ఇవ్వాలని, తామే స్వయంగా తమ సిబ్బందికి వేసుకుంటామని అంటున్న ప్రైవేటు ఆసుపత్రులు, ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖకు తమ అభిప్రాయాలను తెలిపాయి. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ఫ్రంట్ లైన్ యోధుల వివరాలు అందించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు ఆరోపించిన నేపథ్యంలో టీకాను తమకే ఇవ్వాలని వారంతా కోరుతుండటం గమనార్హం.

కాగా, తెలంగాణలో రికార్డుల్లో నమోదుకాని ఆసుపత్రులు, ప్రైవేటు క్లినిక్ లు, గల్లీల్లో ఉన్న క్లినిక్ లు చాలానే ఉన్నాయన్న సంగతి తెలిసిందే. వివరాలు ఇస్తే, టీకాను తొలుత వారికే ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసినా, పేర్లు చెబితే తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళనతోనే వారు వివరాలు వెల్లడించేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

ఇదిలావుండగా, టీకా అందుబాటులోకి రాగానే వైద్య సిబ్బందికి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించినా, ఇంతవరకూ 10 శాతం మంది పేర్లు కూడా నమోదు కాలేదని సమాచారం. చాలా ప్రైవేటు హాస్పిటల్స్, తమ వద్ద పనిచేస్తున్న సిబ్బంది వివరాలను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. దీంతో మల్లగుల్లాలు పడుతున్న వైద్య ఆరోగ్య శాఖ, టీకా పంపిణీ ప్రభుత్వం అధీనంలోనే సాగుతుందని స్పష్టం చేస్తున్నా, ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం అందుకు అంగీకరించడం లేదు.

ఇక కొవిన్ సాఫ్ట్ వేర్ లో నమోదు కాని వారికి టీకాను ఇవ్వబోమని, ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ డోస్ లను ఇస్తే, అది అసలైన లబ్దిదారులకు చేరకుండా పక్కదారి పట్టే అవకాశాలు అధికమని ప్రభుత్వం వాదిస్తోంది. ఇదే సమయంలో తమ సిబ్బందికి తామే టీకాలు ఇస్తామని ప్రైవేటు ఆసుపత్రులు అంటున్నాయి. ఈ విషయంలో తీవ్ర సందిగ్ధత నెలకొని వుండటంతో ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలు సహకరించాలని తెలంగాణ సర్కారు విజ్ఞప్తి చేస్తోంది.

More Telugu News