Amit Shah: మమతకు షాక్.. అమిత్ షా సమక్షంలో 11 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీ, మాజీ ఎంపీలు బీజేపీలో చేరిక!

  • బెంగాల్ పర్యటన తొలిరోజే వేడి పుట్టించిన అమిత్ షా
  • ఈస్ట్ మిడ్నపూర్ లో భారీ సభ నిర్వహించిన అమిత్
  • బీజేపీ దూకుడుకు డిఫెన్స్ లో పడిన టీఎంసీ
11 TMC MLAs joins BJP in presence of Amit Shah

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ షాకిచ్చింది. ఏకంగా 11 మంది ఎమ్మెల్యేలు ఈరోజు బీజేపీలో చేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బెంగాల్ లో ఎన్నికల వేడిని అమాంతం పెంచారు. రెండు రోజుల పర్యటనకు వెళ్లిన ఆయన ఈరోజు ఈస్ట్ మిడ్నపూర్ జిల్లాలో భారీ బహిరంగసభను నిర్వహించారు. ఈ సభకు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు హాజరయ్యాయి.

ఈ సందర్భంగా అమిత్ షా సమక్షంలో సువేందు అధికారి సహా మరో 10 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి సువేందు వెనక మరో ముగ్గురు లేదా నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్తారని భావించిన టీఎంసీకి ఈ పరిణామం దిగ్భ్రాంతిని కలిగించింది. బీజేపీ లో చేరిన వారిలో దీపాలి బిశ్వాస్, సుక్రా ముండా, శ్యామస్థ ముఖర్జి, తాపసి మొండల్, సుదీప్ ముఖర్జీ, అశోక్ దిండా, షిభద్ర దత్త, సైకత్ పంజా, బనశ్రీ మైతీ, విశ్వజిత్ కుందు ఉన్నారు.

వీరితో పాటు బుర్ద్వాన్ ఎంపీ సునీల్ మొండల్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ఈయనతో పాటు మాజీ ఎంపీ దశరథ్ టిర్కీ కూడా బీజేపీలో చేరారు. ఈ పరిణామాలతో టీఎంసీలో కలకలం రేగింది. రానున్న రోజుల్లో వలసలు పెద్ద సంఖ్యలోనే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎంసీ డిఫెన్స్ లో పడింది.

More Telugu News