Talasani: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసించిన తెలంగాణ మంత్రి తలసాని

Telangana Minister Talasani praises AP CM Jagan
  • దుర్గ గుడికి జగన్ రూ. 70 కోట్లు ఇవ్వడం సంతోషకరం
  • తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయాలు తాత్కాలికం
  • అమరావతిపై జగన్ ప్రభుత్వం దీర్ఘకాలికంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టుంది
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. విజయవాడ దుర్గ గుడి అభివృద్ధికి జగన్ రూ. 70 కోట్లు ఇవ్వడం మంచి పరిణామమని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు అభివృద్ధి చెందడం సంతోషకరమని చెప్పారు. యాదగిరిగుట్ట మరో తిరుపతి కావాలని ఆకాంక్షించారు.  

బీజేపీ రాజకీయాలు తాత్కాలికమని తలసాని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం ఉండదని చెప్పారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టు బీజేపీ ఉరుకులు, పరుగులు పెడుతోందని ఎద్దేవా చేశారు. 2014 నుంచి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఎన్నికలలో గెలిచిందో అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు.

ఇదే సమయంలో ఏపీలో ఐదేళ్ల పాటు అమరావతి పేరుతో కాలయాపన ఎలా జరిగిందో కూడా అందరికీ తెలుసని అన్నారు. ప్రజలకు కావాల్సింది గ్రాఫిక్స్ కాదని, రియాల్టీ అని చెప్పారు. అమరావతిపై జగన్ ప్రభుత్వం దీర్ఘకాలికంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టుందని అన్నారు. అమరావతి కోసం ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమాలపై తాను మాట్లాడబోనని... ఇది ఏపీకి సంబంధించిన సమస్య అని చెప్పారు.
Talasani
TRS
Jagan
YSRCP
BJP

More Telugu News