Amit Shah: రైతు ఇంట్లో నేలపై కూర్చొని భోజనం చేసిన అమిత్ షా

Amit Shah had lunch at farmers house
  • బెంగాల్ పర్యటనలో ఉన్న అమిత్ షా
  • ఈస్ట్ మిడ్నపూర్ జిల్లాలో రైతు ఇంట భోజనం
  • ఇది జీవితంలో మర్చిపోలేని రోజు అన్న రైతు
రెండు రోజుల పర్యటనకు గాను బెంగాల్ కు వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మధ్యాహ్నం ఒక సాధారణ రైతు ఇంట భోజనం చేశారు. ఈస్ట్ మిడ్నపూర్ జిల్లాలోని బలిజూరి గ్రామంలో సనాతన్ సింగ్ అనే రైతు ఇంట్లో నేల మీద కూర్చొని ఆయన భోజనాన్ని ఆరగించారు. ఆయనతో పాటు బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గీయ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా భోంచేశారు.

అమిత్ షా తన ఇంటికి భోజనానికి రావడానికి ముందు సనాతన్ సింగ్ మాట్లాడుతూ, తన ఇంటికి అమిత్ షా భోజనానికి వస్తున్నట్టు పార్టీ సభ్యులు సమాచారం అందించారని తెలిపారు. విషయం తెలియగానే ముందుగా తాను షాక్ కు గురయ్యానని, ఆ తర్వాత ఎంతో సంతోషించానని చెప్పారు. తన జీవితంలో ఇలాంటి గొప్ప రోజు వస్తుందని తాను ఎన్నడూ ఊహించలేదని తెలిపారు.

తాను ఒక పేద రైతునని... అందుకే వారికి అన్నం, దాల్ పెడతానని చెప్పారు. దేశాన్ని ప్రశాంతంగా, సామరస్యంగా ఉంచాలని అమిత్ షాను కోరతానని అన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తికి ఆతిథ్యమివ్వడం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. గత 50 ఏళ్లుగా తాను ఈ పార్టీతో కొనసాగుతున్నానని తెలిపారు.

కొత్త వ్యవసాయ చట్టాలపై ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతుల ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలో... రైతు ఇంట అమిత్ షా భోజనం చేయడం గమనార్హం. భోజనానంతరం ఆయన బహిరంగసభకు బయల్దేరి వెళ్లారు.
Amit Shah
BJP
West Bengal
Farmer
Lunch

More Telugu News