Amit Shah: బెంగాల్ గడ్డపై అమిత్ షా.. వేడెక్కిన పశ్చిమబెంగాల్ రాజకీయం!

  • అర్ధరాత్రి 1.30 గంటలకు కోల్ కతా చేరుకున్న అమిత్ షా
  • రామకృష్ణ ఆశ్రమానికి వెళ్లి అంజలి ఘటించిన వైనం
  • కాసేపట్లో తొలి భారీ బహిరంగసభ
Amit Shah To Hold Mega Rally In Bengal Today

పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల ప్రచారపర్వం ఈరోజు నుంచి మరింత వేడెక్కనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బెంగాల్ గడ్డపై అడుగుపెట్టారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన అమిత్ షాకు కోల్ కతా విమానాశ్రయం వద్ద వందల సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు అమిత్ షా పర్యటన కొనసాగనుంది. మరో నాలుగు నెలల్లో జరగనున్న ఎన్నికలలో కనీసం 200 సీట్లలో గెలుపొందడమే లక్ష్యంగా బీజేపీ నేతలు ముందుకు సాగుతున్నారు.

కోల్ కతాలో తొలుత ఆయన రామకృష్ణ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదా దేవిలకు అంజలి ఘటించి, బెంగాల్ లో తన ఎన్నికల కార్యాచరణను ప్రారంభించారు. మరోవైపు కోల్ కతాలో ల్యాండ్ అయిన వెంటనే అమిత్ షా బెంగాల్ వాసులను ఆకట్టుకునేలా ట్విట్టర్ ద్వారా స్పందించారు.

'గురుదేవ్ ఠాగూర్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, శ్యామ ప్రసాద్ ముఖర్జీ వంటి మహనీయులను కన్న ఈ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా' అని ట్వీట్ చేశారు.

మరోవైపు అమిత్ షా బెంగాల్ లో గడపబోయే ఈ తొలి రెండు రోజుల్లో రాజకీయపరంగా అనేక పరిణామాలు సంభవించనున్నాయి. టీఎంసీకి గుడ్ బై చెప్పిన సువేందు అధికారిని బీజేపీలోకి అమిత్ షా సాదరంగా ఆహ్వానించనున్నారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో తృణమూల్ రెబెల్స్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

కోల్ కతాలోని రామకృష్ణ ఆశ్రమం నుంచి అమిత్ షా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిడ్నపూర్ కు హెలికాప్టర్ లో చేరుకున్నారు. అక్కడ స్వాతంత్ర్య సమరయోధుదు ఖుదీరామ్ బోస్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం సిద్ధేశ్వరి కాళి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు మిడ్నపూర్ లో తన తొలి ఎన్నికల ర్యాలీని నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచార సభకు రావడానికి ముందు అక్కడ ఉన్న ఓ రైతు ఇంట్లో భోజనం చేయనున్నారు.

రేపు ఆయన బోల్పూర్ లో ఉన్న విశ్వ భారతి యూనివర్శిటీని సందర్శిస్తారు. అక్కడి నుంచి రోడ్ షో నిర్వహిస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి జరిగిన 9 రోజుల తర్వాత బెంగాల్ లో అమిత్ షా పర్యటిస్తున్నారు. మరోవైపు బెంగాల్ ను 6 భాగాలుగా విభజించి.. ఒక్కో విభాగం బాధ్యతలను ఒక్కో కేంద్ర మంత్రికి బీజేపీ హైకమాండ్ అప్పగించింది. ఎన్నికలు జరిగేంత వరకు ప్రతి అంశాన్ని వీరు స్వయంగా పర్యవేక్షించనున్నారు. అమిత్ షా రాకతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది.

More Telugu News