Tollywood: థాంక్యూ సీఎం గారు... వైఎస్ జగన్ కు ముక్తకంఠంతో కృతజ్ఞతలు తెలిపిన టాలీవుడ్

  • సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ కేబినెట్ భేటీ
  • సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు
  • టాలీవుడ్ కు రీస్టార్ట్ ప్యాకేజి ప్రకటన
  • విద్యుత్ చార్జీల వెసులుబాటు
  • రుణాలపై మారటోరియం
  • స్పందించిన చిత్ర నిర్మాణ సంస్థలు
Tollywood production houses thanked AP CM Jagan

ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి ప్రభావంతో దెబ్బతిన్న టాలీవుడ్ కు చేయూతనిచ్చేలా కీలక ప్రకటన చేసింది. సినీ పరిశ్రమ రీస్టార్ట్ కు ప్రత్యేక ప్యాకేజి ఉంటుందని వెల్లడించింది. దీనిపై టాలీవుడ్ నిర్మాణ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి.

చిత్ర పరిశ్రమ కోసం రీస్టార్ట్ ప్యాకేజి ప్రకటించిన గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది. ఏపీ సర్కారు పేర్కొంటున్న రీస్టార్ట్ ప్యాకేజితో చిత్ర పరిశ్రమపై ఆధారపడిన ఎంతోమందికి మేలు జరుగుతుందని వెల్లడించింది. ఈ కరోనా కష్టకాలంలో బాగా దెబ్బతిన్న సినీ ఇండస్ట్రీని పునరుద్ధరించడానికి సర్కారు ప్రకటించిన ఉద్ధీపన చర్యలు అభినందనీయం అని అన్నపూర్ణ స్టూడియోస్ తెలిపింది.

ఇక, దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కూడా సోషల్ మీడియాలో దీనిపై స్పందించింది. సీఎం జగన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మినహాయింపులు, ఇతర ఊరట చర్యలు చిత్ర పరిశ్రమ పునఃప్రారంభానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొంది.

ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కు చెందిన ఎస్వీసీసీ కూడా సీఎం జగన్ కు రుణపడి ఉంటామని తెలిపింది. సకాలంలో ప్రకటించిన ఈ చర్యలు ఇండస్ట్రీపై ఆధారపడి ఉన్న లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతాయని భావిస్తున్నామని వెల్లడించింది. సీఎం జగన్ ఆధ్వర్యంలోని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజి యావత్ తెలుగు సినీ రంగాన్ని పునర్నిర్మించేందుకు దోహదపడుతుందని వివరించింది.

ఇవాళ నిర్వహించిన కేబినెట్ భేటీలో టాలీవుడ్ ఉద్ధీపనకు సంబంధించి ఏపీ సర్కారు కీలక నిర్ణయాలు ప్రకటించింది. 3 నెలల పాటు సినిమా హాళ్లు చెల్లించాల్సిన ఫిక్స్ డ్ విద్యుత్ చార్జీలను రద్దు చేశారు. ఈ నిర్ణయం ఏప్రిల్, మే, జూన్ మాసాలకు వర్తిస్తుంది. ఈ క్రమంలో నెలకు రూ.3 కోట్ల చొప్పున ప్రభుత్వమే భరించనుంది. ఆ తర్వాత మిగిలిన 6 నెలల ఫిక్స్ డ్ విద్యుత్ చార్జీలను ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేకుండా వాయిదా వేశారు.

రీస్టార్ట్ ప్యాకేజిలో భాగంగా రాష్ట్రంలో ఉన్న థియేటర్లకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, ఏ, బీ సెంటర్లలోని థియేటర్లకు రూ.10 లక్షలు, సీ సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ.5 లక్షల చొప్పున రుణాలు మంజూరు చేయడమే కాకుండా, రుణ చెల్లింపులపై 6 నెలల వరకు మారటోరియం అమలు చేయనున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి 4.5 శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. కరోనా ప్రభావంతో కుదేలైన టాలీవుడ్ ను ఈ నిర్ణయాలు మరింత ఆదుకుంటాయని టాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.

More Telugu News