Kodali Nani: చంద్రబాబు తోకపార్టీలను వేసుకుని డ్రామాలు ఆడుతున్నారు: కొడాలి నాని

Kodali Nani counters Chandrababu comments
  • అమరావతి ఉద్యమానికి నేటితో ఏడాది
  • రాజధానిలో జనభేరి సభ
  • చంద్రబాబుకు మనసుందా అంటూ కొడాలి నాని ఆగ్రహం
  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదని వ్యాఖ్యలు
  • ఇప్పుడు ఎన్నికలొచ్చినా తమదే విజయం అని ధీమా
అమరావతి ఉద్యమానికి నేటితో సంవత్సరం పూర్తయిన సందర్భంగా జనభేరి సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై ఏపీ మంత్రి కొడాలి నాని అదేస్థాయిలో బదులిచ్చారు. మహిళా రైతులు ఆందోళన చేస్తుంటే చంద్రబాబు తోకపార్టీలను వెంటేసుకుని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

జగన్ కు మనసు లేదని చంద్రబాబు అంటున్నాడని, అసలు చంద్రబాబుకు మనసుందా? అని కొడాలి నాని నిలదీశారు. మనసుంటే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచేవాడా? అని వ్యాఖ్యానించారు. హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క చోట కూడా ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు.

మూడు రాజధానులపై చంద్రబాబు రిఫరెండం అంటున్నారని, దమ్ముంటే ఆయన తన టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఈసారి ఒక్కర్ని కూడా గెలవనివ్వబోమని స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా తమను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
Kodali Nani
Chandrababu
Janabheri
YSRCP
Telugudesam

More Telugu News