Sonia Gandhi: ఎట్టకేలకు కాంగ్రెస్ రెబెల్స్ ను కలిసేందుకు అంగీకరించిన సోనియాగాంధీ

  • పార్టీ పతనమవుతోందంటూ హైకమాండ్ కు గతంలో లేఖ రాసిన కొందరు సీనియర్లు
  • పార్టీలో కలకలం రేపిన లేఖ
  • శనివారం రెబెల్స్ తో భేటీ కానున్న సోనియా
Sonia Gandhi to meet party rebel leaders

కాంగ్రెస్ పార్టీ పతనం దిశగా వెళ్తోందని, పార్టీలో వ్యవస్థాగతమైన మార్పులను తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ కొంత మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు హైకమాండ్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పార్టీలో కలకలం రేపింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పార్టీని మరింత కలవరపాటుకు గురి చేశాయి. కొందరు నేతలను పక్కన పెట్టే పరిస్థితులు కూడా వచ్చాయి.

ఈ నేపథ్యంలో, రెబెల్ నేతలతో సమావేశమయ్యేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఎట్టకేలకు అంగీకరించారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర వహించారు.

సమావేశానికి సంబంధించిన లేఖపై 23 మంది నేతలు సంతకం చేశారు. అయితే వీరందరూ సోనియాను కలవడం లేదు. ఐదు లేదా ఆరు మంది కీలక నేతలు మాత్రమే సమావేశానికి హాజరుకానున్నారు. శనివారం ఈ సమావేశం జరగనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ భేటీకి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు హాజరవుతారా? లేదా? అనే విషయంలో కూడా క్లారిటీ లేదు.

అయితే మరోవైపు ఇంకో వార్త కూడా వినిపిస్తోంది. లెటర్ పై సంతకం చేసిన నాయకులంతా సోనియాతో భేటీ అవుతారని కొందరు చెపుతున్నారు.

More Telugu News