Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తనకు వద్దే వద్దంటున్న రాహుల్ గాంధీ!

  • కాంగ్రెస్ లో నాయకత్వ శూన్యత
  • వచ్చే సంవత్సరం కొత్త అధినేతను ఎన్నుకునే అవకాశం
  • రాహులే ఉండాలంటున్న ఓ వర్గం
Rahul Gandhi Not Willing to Take Congress Chief Post

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు తనకు ఎంతమాత్రమూ ఆసక్తి లేదని రాహుల్ గాంధీ స్పష్టంగా చెబుతున్నారట. పార్టీలో నాయకత్వ శూన్యత ఏర్పడిన వేళ, వచ్చే సంవత్సరం కొత్త అధినేతను ఎన్నుకునేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, పార్టీలో అత్యధికులు తిరిగి రాహుల్ రావాలని కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, రాహుల్ ఇంకా మనసు మార్చుకోలేదని, సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు పార్టీ ఓడిపోవడంపై నైతిక బాధ్యతను తన భుజాలపైనే వేసుకోవాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఉన్న రాహుల్, 2017లో తన తల్లి సోనియా గాంధీ నుంచి బాధ్యతలు స్వీకరించిన సంగతి విదితమే. ఆపై జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పొందగా గత సంవత్సరం జూలైలో రాహుల్ రాజీనామా చేశారు. దీంతో తిరిగి ఆ బాధ్యతలను సోనియా గాంధీ తన భుజస్కంధాలపై వేసుకుని పార్టీని నడుపుతున్నారు. ఇప్పుడు సోనియా అనారోగ్యం కారణంగా పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పగించాలని చూస్తుండగా, గాంధీ ఫ్యామిలీ నుంచి మినహా మరెవరు అధ్యక్షుడైనా విభేదాలు తప్పవని పార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ఇదే సమయంలో పార్టీలోని సీనియర్ నేతలు బలమైన నాయకత్వం ఉండాలని కోరుతూ సోనియా గాంధీకి లేఖను కూడా రాశారు. దీనిపై మొత్తం 23 మంది నేతలు సంతకాలు చేయగా, అది పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడిన తరువాత మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారానికి దూరం కాగా, ఆపై బీహార్ లో సైతం పార్టీ చెప్పుకోతగ్గ ప్రభావాన్ని చూపలేకపోయింది.

దీంతో కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్ సహా ఎంతో మంది నేతలు, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రాహుల్ బదులుగా మరెవరైనా అధ్యక్షుడిగా ఎంపికైతే, నిర్ణయాధికారం ఆయన చేతుల్లోనే ఉంటుందని, పెద్ద నిర్ణయాలు ఏమి తీసుకున్నా ఆయన అనుమతితోనే తీసుకోవాల్సి వుంటుందని పార్టీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News