India: ఇండియా - ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ కు రంగం సిద్ధం... రెండు జట్ల సమస్య ఇదే!

  • ఇరు జట్లకూ ఓపెనర్ల సమస్య
  • పలు పేర్లను పరిశీలిస్తున్న కెప్టెన్లు
  • నిలదొక్కుకునే వారినే ఎంపిక చేయాలన్న అభిప్రాయం
  • కనీసం 50 నిమిషాలు అవుట్ కాకుంటే మంచిదంటున్న నిపుణులు
Who Will Open Innings is the Question for Both India and Australia

రేపటి నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. పింక్ బాల్ ను వాడుతూ జరిగే ఈ టెస్టులో ఇరు జట్లనూ కలవరపెడుతున్న సమస్య ఓపెనింగ్ ఎవరు చేయాలన్నదే. ఇరు జట్ల ఫ్రంట్ లైన్ ఓపెనర్లు ఇప్పటికే గాయాల బారిన పడి, తొలి టెస్టుకు దూరం కాగా, ఆడిలైడ్ వేదికగా, జరిగే తొలి టెస్టులో రెండు జట్లూ కొత్త ఓపెనర్లను పరిచయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

పింక్ బాల్ తో ఆడే మ్యాచ్ ల్లో ఆరంభంలో బాల్ గట్టిగా ఉన్న సమయంలో బ్యాట్స్ మెన్లకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. సాంకేతికంగా, మానసికంగా బలంగా ఉన్న ఆటగాళ్లే క్రీజులో నిలవగలుగుతారని ఇప్పటికే పలు మ్యాచ్ లలో నిరూపితమైంది. బాల్ కనిపించగానే బౌండరీకి తరలించాలని భావించే వారు ఆదిలోనే బోల్తా కొట్టక తప్పదని మ్యాచ్ విశ్లేషకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇరు జట్లూ ఇన్నింగ్స్ ప్రారంభించే ఆటగాళ్లపై దృష్టిని సారించాయి. ఇక ఇదే మ్యాచ్ లో చీకటి పడిన తరువాత ఎదరయ్యే పరిస్థితులపైనా కెప్టెన్లు ప్రత్యేక దృష్టిని సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇండియాకు సంబంధించినంత వరకూ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఒక ఓపెనర్ గా రావడం దాదాపు ఖాయమే. కనీసం 40 నుంచి 50 నిమిషాలు క్రీజులో నిలదొక్కుకోగల మరో ఆటగాడి కోసం కోహ్లీ వెతుకుతున్నాడు. బాల్ గమనంపై దృష్టిని సారించి, తొలి ఓవర్లలో ఇన్నింగ్స్ ను నిలపగల ప్లేయర్ గా కేఎల్ రాహుల్, హనుమ విహారి, ఛటేశ్వర్ పుజారాలను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో మయాంక్ అగర్వాల్ పేరు కూడా వినిపిస్తోంది. అగర్వాల్ ను టెస్ట్ కు సన్నద్ధం చేసేందుకు విరాట్ కోహ్లీ స్వయంగా నెట్స్ లో అతనితో కలిసి ప్రాక్టీస్ చేయడం గమనార్హం.

ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే, డేవిడ్ వార్నర్, విల్ పుకోవ్ స్కీలు ఇప్పటికే గాయాల బారిన పడ్డారు. మరో ఓపెనర్ జోయ్ బుర్న్స్ తానాడిన గత 9 మ్యాచ్ లలో కేవలం 62 పరుగులు మాత్రమే చేశాడు. మార్కస్ హారిస్ సైతం ఇటీవల తన ఫామ్ ను కోల్పోయాడు. దీంతో ఓపెనింగ్ ఆటగాళ్ల సమస్య ఆసీస్ నూ బాధిస్తోంది. మార్నస్ లబుస్ చేంజ్ కి ఓపెనర్ గా ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో మ్యాథ్యూ వేడ్ తో కలిసి హారిస్ కూడా ఆటను ప్రారంభించవచ్చని, ఏదైనా తుది నిర్ణయం తీసుకోవడం కొంత కష్టమేనని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News