అనుకున్నట్టే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్న తృణమూల్ కాంగ్రెస్ రెబల్ సువేందు అధికారి!

16-12-2020 Wed 10:53
  • పశ్చిమ బెంగాల్‌లో వేడెక్కిన రాజకీయం
  • అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు
  • సువేందుతోపాటు మరికొందరు నేతలు కూడా బీజేపీలోకి
Top TMC leader likely To BJP When Amit Shah Visits Bengal

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం అధికార తృణమూల్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాష్ట్రంలో రాజకీయ సెగలు వేడిపుట్టిస్తున్నాయి. ఈసారి ఎలాగైన అధికారంలోకి రావాలని బీజేపీ, అధికారాన్ని నిలబెట్టుకోవాలని మమత బెనర్జీ గట్టి పట్టుదలగా ఉన్నారు. అయితే, అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. వైరిపక్షంలోని నాయకులను తమ గూటికి చేర్చుకోవడం ద్వారా మమతను దెబ్బ కొట్టాలని భావిస్తూ, అడుగులు వేస్తోంది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ వారాంతంలో పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో  టీఎంసీ రెబల్, ఆ పార్టీలో అత్యంత ప్రభావశీల నాయకుడిగా పేరుగాంచిన సువేందు అధికారి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఆయన చేరిక నేపథ్యంలో ఇండోర్ స్టేడియానికి బదులు విశాలమైన మరో మైదానంలో సభ నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. అలాగే, సువేందుతోపాటు రాష్ట్ర మంత్రి రజీబ్ బెనర్జీ, అసన్‌సోల్ మాజీ మేయర్ జితేంద్ర తివారీ కూడా కమలం తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.