Dominic Raab: ఇండియా, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు!

  • రిపబ్లిక్ వేడుకల కోసం రానున్న బోరిస్ జాన్సన్
  • ఈలోగానే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్
  • చర్చల్లో పాల్గొన్న జై శంకర్, డొమినిక్ రాబ్

రానున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని ఇండియాకు రానున్న వేళ, బ్రిటన్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా చర్చలు మొదలయ్యాయి. మంగళవారం నాడు బ్రిటన్ విదేశీ వ్యవహారాల మంత్రి డొమినిక్ రాబ్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ మధ్య చర్చలు కొనసాగాయి. రక్షణ, భద్రత, కరోనా నుంచి రికవరీ దిశగా పరస్పర సహకారం ఈ చర్చల్లో ముఖ్య అజెండాగా మారాయి.

కరోనా మహమ్మారి విజృంభించిన తరువాత, ఇండియాను సందర్శించిన రెండో విదేశీ మంత్రి డొమినిక్ రాబ్ కావడం గమనార్హం. అంతకుముందు యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాత్రమే భారత్ కు వచ్చారు. ఇక ఇండియా, బ్రిటన్ ల మధ్య ఏర్పడనున్న వాణిజ్య బంధం నూతన శకానికి నాందిగా నిలుస్తుందని జై శంకర్ వ్యాఖ్యానించారు. వచ్చే సంవత్సరం బ్రిటన్ లో జరిగే జీ-7 సదస్సుకు నరేంద్ర మోదీకి కూడా ఆహ్వానం పలికారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఇప్పటివరకూ జరిగిన చర్చల్లో రానున్న 10 సంవత్సరాలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారు. రెండు దేశాల మధ్యా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరేలా చూడటమే ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యతాంశంగా భావిస్తున్నామని చర్చల్లో పాల్గొన్న అధికారులు వెల్లడించారు. ఈ ఒప్పందం కుదిరితే రెండు దేశాల్లోని వ్యాపార వర్గాలూ లాభపడతాయని, ఆహారం, శీతల పానీయాలు, ఆరోగ్య ఉత్పత్తులు, లైఫ్ సైన్సెస్, ఐటీ, డేటా, రసాయనాలు, ఆర్థిక సేవల విభాగాల్లో ఉన్న అవాంతరాలన్నీ తొలగిపోతాయని బ్రిటన్ మంత్రి డొమినిక్ రాబ్ వ్యాఖ్యానించారు.

More Telugu News