పొత్తు గురించి తేల్చాల్సింది రజనీకాంతే: కమల్ స్పష్టీకరణ
- ఇద్దరం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నామన్న కమల్
- సిద్ధాంతాలు కలిస్తే పొత్తు సాధ్యమేనని వెల్లడి
- ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తే కలుస్తామని వివరణ
- ఇగోలు పక్కనబెట్టి సహకరించుకుంటామని వ్యాఖ్యలు
మరికొన్నిరోజుల్లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. రజనీకాంత్ స్థాపించబోయే పార్టీ త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందా, లేక పొత్తులు పెట్టుకుంటుందా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో, తనను ఈ విషయమై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ వివరణ ఇచ్చారు.
పొత్తు గురించి తేల్చాల్సింది రజనీకాంతేనని స్పష్టం చేశారు. పొత్తుపై రజనీ ఆసక్తి చూపిస్తే ఇద్దరం కూర్చుని చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. "ఇద్దరం ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం. మా సిద్ధాంతాలు కలిసి, ప్రజలకు మా కలయిక మేలు చేస్తుందని భావిస్తే తప్పకుండా పొత్తు పెట్టుకుంటాం. మా ఇగోలు పక్కనబెట్టి పరస్పరం సహకరించుకుంటాం" అని వివరించారు.
ఇక, ఎంఐఎంతో మక్కల్ నీది మయ్యం పొత్తు ఉంటుందన్న వార్తలపైనా కమల్ బదులిచ్చారు. పొత్తులు కుదుర్చుకునే అధికారాన్ని పార్టీ తనకు కట్టబెట్టిందని, త్వరలోనే ఎంఐఎంతో పొత్తు అంశంపై ప్రకటన చేస్తానని తెలిపారు.
























