Vijayashanti: బీజేపీ దెబ్బకు కేసీఆర్ దొరగారికి ఒక్కసారిగా నిరుద్యోగులు గుర్తొచ్చారు: విజయశాంతి

  • ఉద్యోగార్థులను ఆరేళ్లు పూచికపుల్లల్లా తీసిపారేశారని వ్యాఖ్య 
  • ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఉద్యోగాలంటున్నారంటూ ఎద్దేవా 
  • బీజేపీ విజయాలతో కేసీఆర్ కు దడపుట్టిందని వ్యాఖ్యలు
  • జోనల్ సిస్టంను పట్టించుకోలేదని విమర్శలు
Vijayasanthi criticizes CM KCR over employment notifications

ఉద్యోగార్థులను ఆరేళ్లుగా పూచికపుల్లలా తీసిపడేసిన సీఎం కేసీఆర్ ఆదరాబాదరాగా 50 వేల ఉద్యోగాల భర్తీ అంటూ పొలికేక పెట్టారని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. అటు దుబ్బాకలోనూ, ఇటు జీహెచ్ఎంసీలోనూ బీజేపీ దూకుడు దెబ్బకు కేసీఆర్ దొరగారికి ఒక్కసారిగా నిరుద్యోగులు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు.

మన ఉద్యోగాలు మనకు, మన నీళ్లు మనకు అంటూ ఎప్పుడో ఉద్యమకాలంలో నినదించి, అధికార పగ్గాలు అందుకోగానే ఆ  విషయం మర్చిపోయారు అంటూ ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ విజయాలు కేసీఆర్ కు దడపుట్టించడంతో నిరుద్యోగుల ప్రస్తావన తీసుకువస్తున్నారని విమర్శించారు.

ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండేళ్లుగా జోనల్ సిస్టమ్ ను తెలంగాణ సర్కారు పట్టించుకోలేదని, టీచర్ల ఏకీకృత సర్వీసు అంశంలో కేంద్ర హోంశాఖ లేవనెత్తిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదని విజయశాంతి విమర్శించారు. తత్ఫలితంగా రెండు జిల్లాల నిరుద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి నెలకొందని తెలిపారు.

 సవరించిన జోన్లకు రాష్ట్రపతి ఆమోదం అవసరమని, ఇవిగాక మరెన్నో చిక్కులు దీనితో ముడిపడి ఉన్నాయని, ఇవేమీ తేలకుండానే కొత్త పోస్టుల భర్తీ అంత తేలిక కాదని స్పష్టం చేశారు. నిరుద్యోగులను మరోసారి ధోకా చేసే ప్రయత్నాలు రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాగవని ఈ మోసాల సీఎం గమనించాలని పేర్కొన్నారు.

More Telugu News