Pranab Mukherjee: ఫైనల్ కాపీని నేను చదివేంత వరకు ఆ పుస్తకాన్ని ఆపండి: ప్రణబ్ ముఖర్జీ కుమారుడు

  • విడుదలకు ముందే దుమారం రేపుతున్న 'ప్రెసిడెన్షియల్ ఇయర్స్' పుస్తకం
  • తన అనుమతి లేనిదే పుస్తకాన్ని ప్రచురించవద్దన్న అభిజిత్ ముఖర్జీ
  • పుస్తకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దన్న శర్మిష్ట ముఖర్జీ
Pranab Mukherjees son demands to stop the book

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జీవిత చరిత్రతో 'ప్రెసిడెన్షియల్ ఇయర్స్' అనే పుస్తకం రానున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో విడుదలకానున్న ఈ పుస్తకానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికే రాజకీయ దుమారాన్ని రేపాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ లే కారణమని ప్రణబ్ ఈ పుస్తకంలో రాసినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, తమ అనుమతి లేనిదే పుస్తకాన్ని ప్రచురించడం కానీ, విడుదల చేయడం కానీ చేయకూడదని ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ అన్నారు.

తన తండ్రి  జీవిత చరిత్ర పేరుతో కొన్ని ప్రేరేపిత అంశాలు ప్రచారమవుతున్నాయని అభిజిత్ అన్నారు. ప్రణబ్ ముఖర్జీ కుమారుడిగా ఆ పుస్తకాన్ని ప్రచురించడాన్ని ఆపాలని తాను కోరుతున్నానని చెప్పారు. ప్రచురణకు ముందు ఫైనల్ కాపీని తనకు ఇవ్వాలని, తాను చదివి లిఖితపూర్వకంగా సమ్మతి తెలియజేసేంత వరకు పుస్తక ప్రచురణను ఆపాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని సవివరంగా ప్రచురణకర్తలకు లేఖ రూపంలో పంపించానని చెప్పారు.  

ఇదే అంశంపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ కూడా స్పందించారు. చీప్ పబ్లిసిటీ కోసం తండ్రి పుస్తకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని తన సోదరుడికి సూచించారు.

More Telugu News