Triclosan: టూత్ పేస్టుల్లో ట్రైక్లోసాన్... దీంతో ముప్పు ఉందంటున్న ఐఐటీ హైదరాబాద్ నిపుణులు

IIT Hyderabad researchers says Triclosan may effective on nervous system
  • నిత్యం వాడే టూత్ పేస్టుల్లో ట్రైక్లోసాన్
  • ఉత్పత్తుల కాలపరిమితి పెంచే రసాయనం
  • ఇది నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుందంటున్న పరిశోధకులు
  • జీబ్రాఫిష్ పై పరిశోధన
  • న్యూరాన్లపై ప్రభావం పడుతున్నట్టు గుర్తింపు
మనం నిత్యం వాడే టూత్ పేస్టుల్లో ఉండే ట్రైక్లోసాన్ అనే రసాయనిక పదార్థం మానవులపై దుష్ప్రభావం చూపుతుందని ఐఐటీ హైదరాబాద్ నిపుణులు అంటున్నారు. టూత్ పేస్టుల్లో హానికారక పదార్థాలపై ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఇందులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తమ ఉత్పత్తులపై ప్రభావం చూపించే సూక్ష్మక్రిములను సంహరించేందుకు పలు కంపెనీలు ట్రైక్లోసాన్ కలుపుతుంటాయి. తద్వారా ఉత్పత్తుల కాలపరిమితి పెరుగుతుంది.

అసలు ట్రైక్లోసాన్ ఎంత కలపాలన్న దానికి ఓ నిర్దిష్టమైన పరిమితి ఉంది. అయినప్పటికీ, ఆ పరిమితి కంటే 500 రెట్లు తక్కువగా ట్రైక్లోసాన్ కలిపినా అది మనుషుల నాడీ వ్యవస్థలను దెబ్బతీస్తుందని ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు గుర్తించారు. ఎంతో స్వల్ప మోతాదులో అయితే ట్రైక్లోసాన్ ను మానవులు తట్టుకోగలరని, అయితే నిత్యం వాడే వస్తువుల్లో ఈ రసాయనం ఉండడం వల్ల ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఐఐటీ హైదరాబాద్ బయోటెక్నాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ అనామికా భార్గవ వెల్లడించారు.

మానవ వ్యాధి నిరోధక శక్తిను పోలివుండే ఇమ్యూనిటీని కలిగివున్న జీబ్రాఫిష్ పై ఈ మేరకు పరిశోధనలు నిర్వహించారు. టూత్ పేస్టులోని ట్రైక్లోసాన్ ఆ చేపలోని న్యూరాన్లపై తీవ్ర ప్రభావం చూపినట్టు వెల్లడైంది. ఈ అధ్యయనం తాలూకు వివరాలను బ్రిటన్ కు చెందిన కెమ్ స్పియర్ అనే జర్నల్ లో ప్రచురించారు. అమెరికాలో ట్రైక్లోసాన్ వినియోగంపై పాక్షికంగా ఆంక్షలు ఉన్నాయి. భారత్ లో మాత్రం దీనిపై ఇంకా సమీక్ష జరగలేదు. కాగా, ట్రైక్లోస్లాన్ శాతాన్ని ఆయా ఉత్పత్తులపైన ముద్రించడం చూడొచ్చు.
Triclosan
Toothpaste
IIT Hyderabad
Study

More Telugu News