Boris Johnson: భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని

Boris Johnson will come to India for Republic day event
  • మరికొన్నిరోజుల్లో భారత్ లో గణతంత్ర వేడుకలు
  • బోరిస్ జాన్సన్ కు ఆహ్వానం పంపిన భారత్
  • సానుకూలంగా స్పందించిన బ్రిటీష్ ప్రధాని
  • ముగ్ధుడ్నయ్యానంటూ ప్రకటన
  • తమకు దక్కిన గొప్ప గౌరవం అంటూ బ్రిటన్ విదేశాంగ శాఖ వెల్లడి
మరికొన్నిరోజుల్లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు ఆహ్వానం పంపగా, ఆయన సానుకూలంగా స్పందించారు. భారత్ వస్తున్నానని తెలిపారు. దీనిపై బ్రిటీష్ విదేశాంగ శాఖ స్పందిస్తూ ఇదొక గొప్ప గౌరవంగా భావిస్తున్నామని పేర్కొంది. ప్రధాని అయ్యాక బోరిస్ జాన్సన్ కు భారత్ లో ఇదే తొలి ప్రధాన ద్వైపాక్షిక పర్యటన అని బ్రిటన్ పీఎంఓ వెల్లడించింది.

బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా దీనిపై ఓ ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఓ ఉద్విగ్నభరితమైన పర్యటన కోసం భారత్ వస్తున్నానని తెలిపారు. తనకు ఆహ్వానం పంపడం పట్ల ఎంతో ముగ్ధుడ్నయ్యానని వివరించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తన పర్యటన ఒక గొప్ప ముందడుగు అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాను, ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

కాగా, భారత్ కు స్వాతంత్ర్యం వచ్చాక ఎర్రకోటపై జరిగే రిపబ్లిక్ వేడుకలకు హాజరవుతున్న రెండో బ్రిటీష్ నేత బోరిస్ జాన్సన్. 1993లో జాన్ మేజర్ భారత గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

అటు, బోరిస్ జాన్సన్ రాకపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ స్పందిస్తూ, భారత రిపబ్లిక్ డే వేడుకలకు బ్రిటన్ ప్రధాని రావడం ఓ కొత్త శకానికి నాంది అని పేర్కొన్నారు.
Boris Johnson
Chief Guest
Republic Day
India
UK

More Telugu News