India: జూలై 2 తరువాత అతి తక్కువ కొత్త కేసులు.. ఇండియాలో 95 శాతం దాటిన రికవరీ రేటు!

  • గణనీయంగా తగ్గిన కొత్త కేసుల సంఖ్య
  • నిన్న తాజాగా 22,065 కేసులు
  • 95 శాతం దాటిన రికవరీ రేటు
  • టీకా పంపిణీకి పలు రాష్ట్రాల సన్నాహాలు
Very Low Nec Corona Cases After July 2

ఇండియాలో కరోనా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మార్చిలో లాక్ డౌన్ మొదలైన తరువాత, పెరుగుతూ వచ్చిన కేసులు, సెప్టెంబర్ లో గరిష్ఠాలకు చేరగా, జూలై 2 తరువాత అతి తక్కువ కేసులు సోమవారం నాడు నమోదయ్యాయి. సోమవారం నాడు మొత్తం 1,93,665 మంది నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహించగా, కేవలం 22,065 కేసులు మాత్రమే వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో సానుకూల వాతావరణం కనిపిస్తోందని, రికవరీల సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతోందని ఈ సందర్భంగా వైద్య శాఖ వ్యాఖ్యానించింది.గత సోమవారం ఒక్క రోజులో మహమ్మారి నుంచి కోలుకుని, 34,477 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటివరకూ దేశంలో 99,06,165కు మొత్తం కేసుల సంఖ్య చేరుకోగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3.39 లక్షలుగా ఉంది. అంటే, కరోనా సోకిన వారిలో కేవలం 3.43 శాతం మంది మాత్రమే చికిత్సలో ఉన్నారు. ఇప్పటివరకూ వైరస్ కారణంగా 1,43,709 మంది కన్నుమూయగా, మిగతా 94 లక్షలకు పైగా బాధితులు కోలుకున్నారు. కోలుకున్న వారి రేటు 95.12 శాతానికి పెరిగిందని కేంద్ర అధికారులు తెలియజేశారు.

ఇక కరోనా టీకాను దేశ ప్రజలకు పంచేందుకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు మౌలిక వసతులను సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణలో వైద్యబృందాలకు శిక్షణా కార్యక్రమం కూడా ప్రారంభమైంది. వ్యాక్సిన్ ను కేంద్రం అనుమతించగానే, మొత్తం 10 వేల టీమ్ లను ఏర్పాటు చేసి, ఒక్కో టీమ్ ద్వారా రోజుకు 100 మందికి టీకాలను ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజుకు 10 లక్షల మంది చొప్పున వారం రోజుల్లో 70 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న దృఢ నిశ్చయంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ సైతం ఇదే తరహా ఏర్పాట్లు చేస్తోంది.

More Telugu News