AIIMs: ఢిల్లీ ఎయిమ్స్ లో నర్సుల నిరవధిక సమ్మె... కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరిక!

  • మహమ్మారి సమయంలో సమ్మెలు వద్దు
  • మీ సేవలు ఎంతో అవసరమని నర్సులకు విజ్ఞప్తి
  • సమ్మె దురదృష్టకరమన్న రణదీప్ గులేరియా
AIIMS Nuses on Indefinet Strike

న్యూఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ లో నిన్న మధ్యాహ్నం నుంచి నర్సులంతా నిరవధిక సమ్మెకు దిగగా, కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 6వ సెంట్రల్ పే కమిషన్ సిఫార్సులను తక్షణం అమలులోకి తీసుకురావాలని, తమ న్యాయమైన కోరికలను తీర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కాగా, నర్సులు సమ్మెకు దిగడంపై స్పందించిన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ, "మీరంతా సమ్మెకు దిగకుండా, తిరిగి విధుల్లో చేరండి. ఈ మహమ్మారి సమయంలో మీ సేవలు ఎంతో అవసరం" అని కోరారు.

"నర్సుల యూనియన్ సమ్మెకు పిలుపునివ్వడం దురదృష్టకరం. కరోనా నివారణ దిశగా వ్యాక్సిన్ అతి త్వరలోనే రానున్న ఈ సమయంలో ఈ తరహా చర్యలు కూడదు. నర్సులు మొత్తం 23 డిమాండ్లను మా ముందుంచారు. దాదాపు అన్ని డిమాండ్లను ఎయిమ్స్ కార్యనిర్వాహక విభాగం, ప్రభుత్వం పరిశీలిస్తున్నాయి" అని ఆయన అన్నారు.

కాగా, ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది ఎటువంటి సమ్మెలు, నిరసనలకు దిగేందుకు వీల్లేదని గుర్తు చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, వెంటనే సమ్మెకు దిగిన వారంతా తిరిగి విధుల్లోకి చేరాలని కోరారు. కోర్టు ఆదేశాలను పాటించకుంటే, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నర్సుల డిమాండ్లను చర్చించి, పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

More Telugu News