Donald Trump: జూలియన్ అసాంజేకు క్షమాభిక్ష... వైట్ హౌస్ ను వీడే ముందు సంచలన నిర్ణయం తీసుకోనున్న ట్రంప్!

  • ముగింపు దశకు చేరుకున్న ట్రంప్ పదవీకాలం
  • యూఎస్ సైనిక రహస్యాలను దొంగిలించాడని అసాంజేపై అభియోగం
  • నేరం నిరూపితమైతే 175 ఏళ్ల జైలుశిక్ష
  • క్షమాభిక్ష పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్న నిపుణులు
Trump to Pardon Julian Assange

వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగింపు దశకు చేరుకుంది. మరో 35 రోజుల్లో ఆయన తన బాధ్యతలను జో బైడెన్ కు అప్పగించాల్సిన పరిస్థితి. తన ఒటమిని అంగీకరించేది లేదని ఎంతగా వాదిస్తున్నా, కోర్టు తీర్పుల నుంచి ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నిక వరకూ అంతా ఆయనకు వ్యతిరేకంగానే నడించింది. ఈ నేపథ్యంలో తాను పదవిని వీడే ముందు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

అనధికార వర్గాల సమాచారం ప్రకారం, యూఎస్ తో పాటు ఎన్నో దేశాలకు చెందిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేసి, ప్రస్తుతం అనారోగ్యంతో జైలులో ఉన్న జూలియన్ అసాంజేకు ట్రంప్ క్షమాభిక్ష పెట్టాలని భావిస్తున్నారట. ఈ విషయాన్ని ట్రంప్ కు సన్నిహితుడైన పాస్టర్ మార్క్ బుర్న్స్ స్వయంగా వెల్లడించగా, ట్విట్టరాటీలు, అది నిజమే కావచ్చని కామెంట్లు వెల్లువెత్తిస్తున్నారు.

ఈ విషయమై ట్రంప్ టీమ్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, అసాంజేతో పాటు స్నోడెన్ ను కూడా క్షమించాలని తాను భావిస్తున్నట్టు గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా గుర్తు చేస్తోంది. డిసెంబర్ 3న స్నోడెన్ ఓ ట్వీట్ చేస్తూ... "అధ్యక్షా... మీరు దయచూపుతూ, అధికారంలోనే ఉన్న సమయంలోనే జూలియన్ అసాంజేను విడుదల చేయిస్తే, అతని ప్రాణాలను కాపాడిన వారవుతారు" అని వ్యాఖ్యానించారు.

కాగా, వికీలీక్స్ అనే సంస్థను స్థాపించిన అసాంజే, ఎన్నో దేశాలకు చెందిన సమాచారాన్ని లీక్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు దేశాలు అసాంజేపై అరెస్ట్ వారెంట్లను జారీ చేయగా, దాదాపు 7 సంవత్సరాలు లండన్ లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందిన ఆయన, ప్రస్తుతం ఎన్నో కేసులను ఎదుర్కొంటున్నారు. అమెరికా మిలటరీ సీక్రెట్లను దొంగిలించాడన్నది అసాంజేపై ఉన్న ప్రధాన అభియోగం.

ప్రస్తుతం 49 ఏళ్ల వయసులో ఉన్న అసాంజే, అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనపై ఉన్న కేసులు నిరూపితమైతే, యూఎస్ చట్టాల ప్రకారం, 175 సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News