హైదరాబాదులో షూటింగ్ చేస్తున్న రజనీకాంత్!

14-12-2020 Mon 17:20
  • శివ దర్శకత్వంలో రజనీకాంత్ 'అన్నాత్తే' 
  • కథానాయికలుగా నయనతార, కీర్తిసురేశ్
  • ప్రత్యేక విమానంలో హైదరాబాదుకి రాక
  • రామోజీ ఫిలిం సిటీలో నేటి నుంచి షూటింగ్      
Rajanikanth joins shooting in Hyderabad
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు హైదరాబాదులో షూటింగ్ చేస్తున్నారు. శివ దర్శకత్వంలో ఆయన ప్రస్తుతం 'అన్నాత్తే' సినిమాలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కి ముందే ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగ్ జరిగింది. లాక్ డౌన్ కారణంగా మిగతా సినిమాలలానే దీనికీ అంతరాయం కలిగింది.

ఇక ఇప్పుడు అందరూ కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ మళ్లీ సెట్స్ కి వస్తుండడంతో ఈ చిత్రం షూటింగును కూడా మొదలెట్టారు. తమిళనాడు రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను కూడా పాల్గొంటున్నందున ఆలోగా ఈ చిత్రం షూటింగును పూర్తిచేసేయాలని రజనీ నిర్ణయించుకున్నారు. దాంతో షూటింగుకి రామోజీ ఫిలిం సిటీని ఎంచుకుని, అక్కడ ప్రత్యేకమైన సెట్స్ వేశారు.

ఈ క్రమంలో నిన్న రజనీకాంత్, నయనతార, ఇతర ముఖ్య యూనిట్ సభ్యులు కలసి చెన్నై నుంచి హైదరాబాదుకి స్పెషల్ ఫ్లయిట్ లో వచ్చినట్టుగా తెలుస్తోంది. నేటి నుంచి ఫిలిం సిటీలో షూటింగును నిర్వహిస్తున్నారు. ఇది భారీ షెడ్యూలుగా ప్లాన్ చేశారు. రజనీ స్టయిల్ మాస్ మసాలా అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇందులో ఇంకా కీర్తిసురేశ్, ఖుష్బూ, మీనా, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్నికలలో రజనీకి రాజకీయంగా ఉపయోగపడేలా ఇందులో పొలిటికల్ పంచ్ డైలాగులు కూడా బాగా వున్నాయట. వాటిని ప్రత్యేకంగా రజనీనే రాసుకున్నట్టు చెబుతున్నారు.