Atchannaidu: సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులను రోడ్డెక్కేలా చేశారు: ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు ఫైర్

  • ఉపాధ్యాయుల వ్యతిరేకిగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది
  • నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులపై కేసులు పెడుతున్నారు
  • ఈ నెల 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాం
Atchannaidu says govt is playing politics in teachers transfers

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. ఉపాధ్యాయ బదిలీల్లో కూడా రాజకీయం చేస్తుండటం సిగ్గుచేటని అన్నారు. సీనియారిటీని చూడకుండా సొంత మనుషులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వెబ్ కౌన్సిలింగ్ పేరుతో బదిలీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఉపాధ్యాయ వ్యతిరేక ప్రభుత్వంలా జగన్ సర్కార్ నడుచుకుంటోందని చెప్పారు. సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులను రోడ్డెక్కేలా చేశారని విమర్శించారు.

వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు వద్దని ఉపాధ్యాయులంతా కోరుతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 50 నుంచి 60 శాతం ప్రాంతాలను ఎందుకు బ్లాక్ చేశారని నిలదీశారు. నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులపై కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చామని తెలిపారు. మార్చ్, ఏప్రిల్ నెలల సగం జీతం ఇంత వరకు ఇవ్వలేదని దుయ్యబట్టారు.

ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు నిలబెట్టి వారి పరువు తీశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 11వ పీఆర్సీని ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో స్కూళ్లను తెరిచి ప్రాణాలు తీశారని అన్నారు. కరోనాతో ప్రాణాలొదిలిన ఉపాధ్యాయుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని చెప్పారు.

More Telugu News