Akbaruddin Owaisi: తప్పు చేస్తే కాలర్‌ పట్టుకుని నడిబజారులో నిలబెడతా: పార్టీ కార్పొరేటర్లకు అక్బరుద్దీన్‌ ఒవైసీ వార్నింగ్

  • ఎంఐఎం కార్పొరేటర్లను సన్మానించిన ఒవైసీ
  • వసూళ్లకు పాల్పడితే క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరిక
  • ప్రజాసేవ చేయడానికి దేవుడిచ్చిన అవకాశంగా భావించాలన్న ఒవైసీ
Akbaruddin Owaisi warns MIM corporators

తమ పార్టీ కార్పొరేటర్లకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కార్పొరేటర్ పదవిని అడ్డుపెట్టుకుని వేధింపులకు గురి చేయడం, డబ్బు వసూలు చేయడం వంటి పనులు చేస్తే కాలర్ పట్టుకుని నడి బజారులో నిలబెడతానని హెచ్చరించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలతో హఫీజ్ బాబా నగర్ లోని  ఫలక్ ప్యాలస్ ఫంక్షన్ హాల్లో ఎంఐఎం విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో గెలుపొందిన కార్పొరేటర్లను అక్బరుద్దీన్ ఒవైసీ సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేటర్లుగా ఎన్నికైన అందరూ కూడా ప్రజాసేవ చేయడానికి ఇది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావించాలని చెప్పారు. అధికారం ఉంది కదా అని ప్రజలను వేధించొద్దని అన్నారు. డబ్బు వసూళ్లకు పాల్పడినట్టు తెలిస్తే క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చాంద్రాయణగుట్ట ప్రాంతం తన రక్తం చిందిన నేల అని అన్నారు. ఈ ప్రాంతంపై తనకు ఎంతో ప్రేమ, మక్కువ ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతం తన ప్రాణం, తన శ్వాస అని తెలిపారు. అలాంటి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులను కలిగించినా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.

More Telugu News