America: అమెరికాను ఊపేస్తున్న కరోనా.. నిండిపోతున్న ఆసుపత్రులు!

  • అమెరికాను మళ్లీ భయపెడుతున్న కేసులు
  • కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు
  • వైద్య సిబ్బందిపై విపరీతమైన ఒత్తిడి
  • న్యూయార్క్, పెన్సిల్వేనియాల్లో మళ్లీ ఆంక్షలు
Corona cases increased in US once again

కరోనా వైరస్ అమెరికాను మరోమారు కబళిస్తోంది. రోజురోజుకు కొవిడ్ కేసులు లెక్కకుమించి పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆసుపత్రులకు వస్తున్న రోగులకు పడకలు సమకూర్చలేక అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో నర్సు నలుగురైదుగురు రోగులను చూడాల్సి వస్తుండడంతో పనిభారం ఎక్కువై ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 లక్షల మందికిపైగా కరోనా కాటుకు బలయ్యారు.

ఓవైపు కరోనా కేసులు రోజురోజుకు భయపెట్టేలా పెరుగుతుంటే, మరోవైపు వరుస పండుగలు ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.ఇటీవల జరిగిన ‘థ్యాంక్స్ గివింగ్ డే’ కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైంది. కరోనా నేపథ్యంలో పండుగలను ఇంటిలోనే ఉండి జరుపుకోవాలని ప్రభుత్వం మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో కేసులు విపరీతంగా పెరిగాయి. ‘థ్యాంక్స్ గివింగ్ డే’ తర్వాత కేసుల సంఖ్య ఒక్కసారిగా 16 శాతం పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే క్రిస్మస్, న్యూ ఇయర్ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు వణుకుతున్నారు.

పెరుగుతున్న కేసులతో రోగులు ఆసుపత్రులకు బారులు తీరుతున్నారు. దీంతో అవి కిక్కిరిసిపోయి వైద్య సిబ్బందిపై విపరీతంగా ఒత్తిడి పడుతోంది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం మళ్లీ రంగంలోకి దిగింది. న్యూయార్క్‌లో ఇండోర్ డైనింగ్‌పై గవర్నర్ ఆండ్రూ క్యూమో నిషేధం విధించారు. పెన్సిల్వేనియా పాఠశాలల్లో క్రీడలను నిషేధించారు. జిమ్‌లు, జూదశాలలను మూసివేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ టామ్ వూల్ఫ్ ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News