Washington DC: వాషింగ్టన్ లో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన రైతు నిరసనల మద్దతుదారులు!

Gandhi Statue Vandalised in Washington DC
  • పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగిన ఖలిస్థాన్ వేర్పాటువాదులు
  • ఇండియన్ ఎంబసీ ముందున్న గాంధీ విగ్రహం ధ్వంసం
  • ఆపై నరేంద్ర మోదీ దిష్టిబొమ్మకు ఉరి
  • పదేళ్ల వరకూ శిక్ష పడుతుందని హెచ్చరించిన దౌత్యాధికారులు

ఇండియాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ధర్నాలకు మద్దతుగా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఖలిస్థాన్ వేర్పాటువాదులు నిరసనలకు దిగిన వేళ ఉద్రిక్తత నెలకొంది. వందలాది మంది సిక్కులు గ్రేటర్ వాషింగ్టన్ డీసీ ప్రాంతం సహా, మేరీ లాండ్, వర్జీనియా, న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, ఇండియానా, ఓహియో, నార్త్ కరోలినా తదితర ప్రాంతాల్లో ఒకేసారి వీధుల్లోకి వచ్చారు. వాషింగ్టన్ డీసీలోని భారత దౌత్య కార్యాలయం సమీపంలో ఉన్న గాంధీ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు.

దీంతో అప్పటివరకూ శాంతియుతంగా సాగిన నిరసన హింసకు దారితీసింది. ఖలిస్థాన్ జెండాలతో వచ్చిన వారు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్యానర్లు, పోస్టర్లను ప్రదర్శించారు. వీరంతా భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ ఘటనను భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా ఖండించింది. మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలోకి దూసుకుని రావడం, విగ్రహాన్ని ధ్వంసం చేయడం సరైన చర్య కాదని, ఇది ప్రపంచానికి తప్పుడు సంకేతాలను పంపుతుందని ఓ ప్రకటనలో అధికారులు వ్యాఖ్యానించారు.

ఇక విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించేందుకు, వారిపై చర్యలు తీసుకునేందుకు యూఎస్ అధికారుల సహకారాన్ని కోరామని, ఈ విషయాన్ని హోమ్ శాఖ దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపించాలని కోరామని ఓ అధికారి వెల్లడించారు. వాషింగ్టన్ డీసీ పోలీసులు, సీక్రెట్ సర్వీస్ ఇప్పటికే ఈ ఘటన వెనకున్న వారిని గుర్తించే పనిలో ఉన్నదని అన్నారు.

కాగా, గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన అరగంట తరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను తీసుకుని వచ్చిన కొందరు, దాన్ని ఉరితీసి తమ నిరసనలను తెలిపారు. యూఎస్ చట్టాల ప్రకారం ఏదైనా విగ్రహాన్ని లేదా స్మారకాన్ని ధ్వంసం చేస్తే, వారికి పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని, ఆపై వారిని దేశం నుంచి బహిష్కరిస్తారని, ఇటువంటి చర్యలకు దిగడం వల్ల భారత సంతతి ప్రజలు నష్టపోతారని దౌత్య కార్యాలయం హెచ్చరించింది.

2000 సంవత్సరం సెప్టెంబర్ 16న యూఎస్ పర్యటనకు వచ్చిన నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ తో కలిసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారన్న సంగతి గుర్తుండే ఉంటుంది.

  • Loading...

More Telugu News