సంక్రాంతి తరువాత కరోనా సెకండ్ వేవ్... ఏపీ ప్రభుత్వానికి చేరిన కీలక నివేదిక!

13-12-2020 Sun 09:21
  • ప్రస్తుతం రోజుకు 600 కేసులు
  • మరిన్ని బెడ్లు, ఆక్సిజన్ సిద్ధం చేసుకోవాలి
  • పలు సిఫార్సులు చేసిన ఆరోగ్య శాఖ
Corona Second Wave After Sankranthi in AP

మరో నెల రోజుల తరువాత ఆంధ్రప్రదేశ్ లో కరోనా రెండో దశ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ బృందం ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హెచ్చరించింది. కరోనా పీక్ లో ఉన్న దశలో రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదైన స్థితి నుంచి ప్రస్తుతం ఏపీలో సగటున రోజుకు 600కు కొత్త కేసుల సంఖ్య పడిపోయింది. ఇదే సమయంలో జనవరి 15 తరువాత కేసులు పెరిగే ప్రమాదం ఉందని, దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్యాధికారులు తమ రిపోర్టులో తెలిపారు.చలి తీవ్రత పెరిగే కొద్దీ కేసులు అధికం అవుతాయని, ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను అంచనా వేసిన తరువాత తాము ఈ నిర్ణయానికి వచ్చామని పేర్కొంది.

స్కూల్ టీచర్లు, అంగన్ వాడీ కార్యకర్తలకు ప్రతి రెండు వారాలకూ ఓ మారు టెస్టులను చేయించాలని, జనవరి నాటికి మరిన్ని బెడ్లు, ఐసీయూలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధం చేయాలని సూచించారు. ఇక హై రిస్క్ లో ఉన్న వయో వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రత్యేక వైద్య పరీక్షలు జరిపించాలని, అన్ని మండలాల స్థాయిలో కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించింది.

పలు దేశాల్లో కరోనా కేసులు పీక్ దశకు చేరిన తరువాత, ఐదు నెలల వ్యవధిలోనే రెండో దశ మొదలైందని, ఢిల్లీలోనూ అదే పరిస్థితి నెలకొందన్న విషయాన్ని ప్రస్తావించిన అధికారులు, ఏపీలో ఆగస్టు - సెప్టెంబర్ లో కేసుల తీవ్రత అధికమని గుర్తు చేశారు. ఈ లెక్కన జనవరిలో సెకండ్ వేవ్ వస్తుందని, అయితే దాని తీవ్రత ఎంత ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు. ఆర్టీపీసీఆర్ టెస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ రిపోర్టులో అధికారులు సిఫార్సు చేశారు. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ లను విధిగా ధరించాలని న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తేనే మంచిదని, స్విమ్మింగ్ పూల్స్ కూడా ఇంకొన్ని రోజులు తెరవరాదని సిఫార్సు చేశారు.