Sabarimala: శబరిమలలో కరోనా కలకలం!

  • పలువురు బందోబస్తు పోలీసులకు కరోనా
  • ఓ వైద్యాధికారికి కూడా సోకిన మహమ్మారి
  • దృష్టి సారించాలని ప్రభుత్వానికి నివేదిక
Corona Cases High in Sabarimala

కేరళలో కొలువుదీరిన శబరిమల అయ్యప్ప సన్నిధిలో ఇప్పుడు కరోనా కలకలం రేపుతోంది. మండలపూజ ప్రారంభమై 25 రోజులు అవుతుండగా, ఇప్పటివరకూ 183 మందికి కరోనా మహమ్మారి సోకింది. ఇందులో దాదాపు 75 శాతం మంది అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందే కావడం, వారు తమకు వ్యాధి సోకిందని తెలిసేంత వరకూ సన్నిధానం, పంబ ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తూ ఉండటం ఇప్పుడు అధికారుల్లో, భక్తుల్లో ఆందోళనను పెంచుతోంది.

నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 మధ్య 90కి పైగా పాజిటివ్ కేసులు వచ్చాయని, ఇంతవరకూ 13,625 మంది అయ్యప్ప భక్తులు సహా 16 వేలకు పైగా టెస్టులను నిర్వహించామని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన అధికారులు, కేసుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. అయితే ఇంతవరకూ జరిపిన పరీక్షల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అయ్యప్ప భక్తుల్లో 47 మందికి మాత్రమే వ్యాధి సోకినట్టు నిర్దారణ అయిందని తెలిపారు. ప్రస్తుతం శబరిమల విధుల్లో 2,573 మంది ఉండగా, వారిలో 136 మంది వైరస్ బారిన పడ్డారని, వారిలో 61 మంది పోలీసులు ఉన్నారని తెలిపారు.

సన్నిధానంలో విధుల్లో ఉన్న 11 మందికి, పంబా నది వద్ద విధుల్లో ఉన్న 47 మందికి, నీలక్కల్ బేస్ క్యాంపులో పనిచేస్తున్న ముగ్గురు పోలీసు సిబ్బందికి మహమ్మారి సోకిందని అధికారులు తమ రిపోర్టులో తెలిపారు. ఇదే సమయంలో ఓ వైద్యాధికారికి కూడా వైరస్ సోకిందని, అతని వద్ద చికిత్స నిమిత్తం వచ్చిన భక్తుల వివరాలను సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ రిపోర్టుపై సీరియస్ గా దృష్టిని సారించాల్సిన అవసరం ఉందని కేరళ ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జోసఫ్ వ్యాఖ్యానించారు.

కాగా, దాదాపు 7 నెలల మూసివేత అనంతరం గత నెల 15న శబరిమల అయ్యప్ప దేవాలయం తలుపులు తెరుచుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 26 వరకూ మండల పూజలు, ఆపై జనవరి 20 వరకూ మకర విలక్కు పూజలు జరుగనున్నాయి. స్వామి దర్శనానికి అనుమతిస్తున్న భక్తుల సంఖ్యను కూడా ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు పెంచిన నేపథ్యంలో కరోనా కేసులు కూడా పెరుగుతుండటం గమనార్హం.

More Telugu News